హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశకు నిధులు కేటాయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీకి లేఖ రాశారు. హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో ప్రాజెక్టును మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, మెట్రో రెండో దశలో 31 కిలోమీటర్ల మేర జరుగనున్న పనులకు రూ.8,453 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని లేఖలో పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకాపూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పనులను చేపట్టనున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను గత నెల 31న మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేంద్రానికి సమర్పించారని గుర్తుచేశారు.
కాగా మెట్రో మొదటి దశ ప్రజలకు విజయవంతంగా అందుబాటులోకి వచ్చిందని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో వయబుల్ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) విధానంలో నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అని వివరించారు. 2019-20 తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మరింత వృద్ధి చెందుతున్నదని, కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తరువాత ప్రజా అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మెట్రో రెండో దశను చేపట్టడానికి ప్రతిపాదనలను రూపొందించామన్నారు. రెండో దశకు సంబంధించిన పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టడానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, అపాయింట్‌మెంట్ ఇవ్వగానే స్వయంగా వచ్చి కలుస్తానని, ఆలోగా ప్రక్రియలో జాప్యం కాకుండా ఉండటానికి లేఖ రాస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.