రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం జీనోమ్‌వ్యాలీలో రూ.1,100 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులను ప్రారంభించారు. టీ-హబ్ తరహాలో ఏర్పాటుచేయనున్న ప్రతిష్ఠాత్మక బయోఫార్మా హబ్ (బీ-హబ్)కు శంకుస్థాపన చేశారు. జీవీ-1 అనే మరో కొత్త ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించారు. ఇప్పటికే కొనసాగుతున్న ఇన్నోపోలిస్, టచ్‌స్టోన్, ఏఆర్‌ఎక్స్‌లకు చెందిన రెండో దశ కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేసిన ఆర్ అండ్‌డీ క్లస్టర్ జీనోమ్ వ్యాలీనేనని పేర్కొన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ 200లకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు చిరునామా అన్నారు. ప్రపంచ ఆరోగ్య, సంరక్షణ రంగంలో మన రాష్ట్రం, ఇక్కడి లైఫ్ సైన్సెస్ సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
జీనోమ్ వ్యాలీలో ప్రస్తుతం సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200లకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలతో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా అవతరించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఎదిగిందని వివరించారు. ‘తాజా ప్రాజెక్టులతో జీనోమ్ వ్యాలీ లో మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రయోగశాలలు అందుబాటులోకి వస్తాయి. 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో ఎక్కడా లేనంతగా ప్లగ్ అండ్ ప్లే సౌకర్యం జీనోమ్ వ్యాలీలో ఉన్నది. దీనిని ఇంకా విస్తరిస్తున్నాం. ఇక్కడ సీఆర్‌ఓలు, సీడీఎంఓలు ఉన్నాయి. సింజీన్, లారస్, క్యూరి యా తదితర అనేక సీఆర్‌ఓలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు రానున్నాయి’ అని తెలిపారు.
వ్యాక్సిన్ల అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్-19 సమయంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయటంలో తెలంగాణ కీలకపాత్ర పోషించిందని చెప్పారు. వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బయోలాజికల్-ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్‌తోసహా పలు కంపెనీలు రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయని వెల్లడించారు. స్టెరైల్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు చెందిన ఫార్మా కంపెనీ హెటిరో 750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించిందని, ప్రముఖ అంతర్జాతీయ ఔషధ సంస్థ రోచె తన గ్లోబల్ అనలిటిక్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. జీనోమ్ వ్యాలీలో డిమాండ్, కంపెనీల రాకను బట్టి తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం 2030 లక్ష్యానికి ముందుగానే 100 బిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకొంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆర్‌అండ్‌డీ, బయో ప్రాసెస్ ఫెసిలిటీస్, కొలాబరేషన్ మాడ్యూల్స్, గ్రేడ్-ఏ ట్రైనింగ్ రూమ్ సౌకర్యాలు పుష్కలంగా ఉన్న బీ-హబ్, బయోఫార్మా కంపెనీలకు మంచి వేదికగా మారుతుందన్నారు. పిరమిల్-యాపన్ బయోలైఫ్ సైన్సెస్‌లో 8 మిలియన్ల డాలర్లతో కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించటం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ పెట్టుబడులు బయోఫార్మా రంగంలో తెలంగాణ నాయకత్వ స్థానాన్ని బలోపేతం చేస్తాయని కేటీఆర్ అన్నారు.