ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

  • January 24, 2022 12:41 pm

నేడు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని మణికొండ అల్కాపూర్ వద్ద 1200 కోట్లతో 978 కాలనీలకు త్రాగు నీరు అందించేందుకు హైదరాబాద్ జలమండలి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ అంటే… GHMC ఒక్కటే కాదని… ORR లోపల ఉన్న 25 మున్సిపాలిటీలు ఇప్పటికే హైదరాబాద్‌తో కలిసిపోయాయని చెప్పారు. హైదరాబాద్ అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోందన్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబయి నగరాలు వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ మహానగరంలో 2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టామని, చెన్నై లాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా జలమండలి ఆయా ప్రాంతాల్లో రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేయనుంది. మొత్తం 75 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు 2864 కిలోమీటర్ల పైపులైన్లు కొత్తగా వేయనున్నారు. దీంతో 2.9లక్షల కనెక్షన్లు వచ్చే అవకాశం ఉండగా ఆరు లక్షల 32 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE