రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8 కోట్లతో నిర్మించిన స్మార్ట్ రోడ్లను, రూ.2 కోట్లతో నిర్మించిన కౌన్సిల్ హాల్‌ను, రంగంపేటలో రూ.1.50 కోట్లతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో 150KLD సామర్థ్యంతో నిర్మించే మానవ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ ను, నగర పరిపాలన భవనం, దివ్యాంగుల శిక్షణ కేంద్రం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు. పోతననగర్ వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, తక్కళ్లపల్లి రవిందర్ రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా పార్టీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.