mt_logo

సీఎం కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేశారు : మంత్రి కేటీఆర్   

తెలంగాణ అభివృద్ధి, పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్‌బీనగర్‌లో మంగళవారం నాగోల్‌ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్‌ డ్రైన్‌, ఫతుళ్లగూడ నుంచి పీర్జాదిగూడ లింక్‌రోడ్డు, ముక్తిఘాట్‌, పెంపు జంతువుల శ్మశాన వాటిక వాటికను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ పరిధిలో రూ.55 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలని, సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఓ వైపు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందేలా సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా పథకం, కేసీఆర్‌ కిట్‌ ఇలా ఎన్నో రకాల పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభుత్వం ఆదుకుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరో వైపు తెలంగాణ అభివృద్ధి కొత్త నమూనాను భారతదేశం ముందు ఆవిష్కరిస్తూ పట్టణ, అభివృద్ధి, పరిశ్రమలు -పర్యావరణం, వ్యవసాయం – ఐటీ సమతుల్యమైన కొత్త ఇంటిగ్రేటెడ్‌ హెలిస్టిక్‌ మోడల్‌ను భారతదేశం ముందు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రవేశపెట్టమన్నారు.

తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24 లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6 లక్షల కోట్లని, ఈ రోజు 11.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఛూమంతర్‌ అనగానే, అల్లావుద్దీన్‌ అద్భుత దీపంలా ఓ భూతాన్ని బయటకు తీసి పెంచమనంగనే పెరుగలేదని, నోటిమాటలు, ఊకదండుపు ఉపన్యాసాలు, చిత్రవిత్రమైన బట్టలు వేసుకొని ఫోజులు కొడితే జరుగులేదన్నారు. ప్రణాళికా ప్రకారం, క్రమశిక్షణ, వ్యూహంతో ప్రజల అవసరాలేంది ? రాష్ట్రం ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనతో పని చేస్తే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. ఇవాళ కేంద్రం భారతదేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రం చెబుతున్నదని, అత్యత్తుమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయని లెక్కదీస్తే స్వచ్ఛ సర్వేక్షన్‌ 2022 రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. పల్లె, పట్టణ ప్రగతితో అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో సమతుల్యమైన అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని కేటీఆర్‌ అన్నారు.

రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్‌ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండయని, వాటితో ఎక్కువ లాభం ఉండది కాబట్టి మాట్లాడరన్నారు. మనుషులకు ఓట్లుంటయ్‌ కాబట్టి బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో 240 కోట్ల మొక్కలు పెట్టడం సంతోషకరమన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీ పంచాయతీల్లో గ్రీన్‌ బడ్జెట్‌ తీసుకువచ్చి హరితహారం ద్వారా 7.7శాతం గ్రీన్‌ కవర్‌ సాధించామన్నారు. 24శాతం ఉన్న గ్రీన్‌ కవర్‌ ఇవాళ 31.7శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమన్నారు. తెలంగాణలో ఏ పల్లెకు, హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం కనిపిస్తుందన్నారు. ఫతుల్‌గూడ మీదుగా ఫీర్జాదిగూడ వరకు వెళ్తున్న రోడ్డులో ఎక్కడక్కడ రకరకాలు పెట్టామని, త్వరలో సినిమా షూటింగ్‌లు జరుగుతాయని ఎమ్మెల్యే చెబుతుంటే సంతోషం అనిపించిందని కేటీఆర్‌ అన్నారు.

భవిష్యత్‌లో రాష్ట్రం బాగుండాలనే సోయి ఉండే నాయకులు, సోయి ఉండే ప్రభుత్వం ఉంటే చెట్లు, పర్యావరణం గురించి పట్టించుకుంటారన్న కేటీఆర్‌.. గతంలో ఫతుళ్లగూడ ఏరియా ఒక్కప్పుడు అడుగుపెట్టరాకుండా, దుర్వాసన, అటవీ ప్రాంతంలా ఉండేదని, ప్రస్తుతం డంప్‌యార్డ్‌ను అపురూపమైన పార్క్‌గా, దేశంలోని ఎక్కడా లేనివిధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను సంస్కారవంతంగా చేసుకునేలా ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. బతికి ఉనన్ని రోజులు కులం, మతం, భాష, ప్రాంతం పేరుమీద కొట్టుకూనే ఉంటామన్న కేటీఆర్‌.. చివరకు చనిపోయిన తర్వాత మంచిగుండాలనే చెప్పి హిందు, ముస్లిం, క్రిస్టియన్‌ మతాల వాందరికీ వారి ఆచారాలు, ధర్మాలకు అనుగుణంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు.

ఎస్‌ఎన్‌డీపీ పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో 34 పనులు తీసుకున్నామని కేటీఆర్‌ తెలిపారు. ఇందులో రెండు పూర్తయ్యాయని, డిసెంబర్‌ చివరి నాటికి 17 పనులు పూర్తి చేస్తామన్నారు. మరో 15 పనులు జనవరి వరకు పూర్తి చేస్తామన్నారు. హుస్సేన్‌ సాగర్‌ సర్ఫేస్‌ నాలా, బుల్కాపూర్‌ నాలా ఎండాకాలం వరకు పూర్తి చేస్తామన్నారు. రూ.985 కోట్లతో పనులు చేపడుతున్నామని, ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్‌బీసీ నగర్‌ చౌరస్తా రూపు రేఖలు ఎలా మారాయో చూడాలన్నారు. ఎస్‌ఎన్‌డీపీ కింద నగరం నలుమూలలా ఉండే నానాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో రూ.985కోట్లతో మొదటి దశలో పనులు చేపట్టామన్నారు. ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులు చేపడుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తుందని, ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీలు వస్తున్నాయన్నారు. గడ్డి అన్నారంలో పేదల కోసం టిమ్స్ ఆస్పత్రిని రూ. 1500 కోట్ల నిధులతో నిర్మిస్తున్నామన్నారు. మళ్లీ వచ్చేది మన కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత మెట్రోను హయత్ నగర్ వరకు ఫేజ్ 2 కింద పొడిగిస్తాం. నాగోల్-ఎల్బీనగర్ మెట్రో‎లైన్‎ను అనుసంధానిస్తామని అన్నారు.

లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారని తెలిపారు. భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌ అద్భుతంగా ఉందని చెప్పి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగపోతే వెనుకబడి బెంగళూరులా మారిపోతామన్నారు. మూసీ వద్ద రూ.52 కోట్లతో వంతెన నిర్మించనున్నట్లు చెప్పారు. దీంతో వరంగల్‌కు వెళ్లేందుకు సైతం రోడ్డు ఉపయోగపడుతుందని, మూసీపై కొత్తగా 14 వంతెనలను నిర్మించనున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆటోనగర్‌ను ఫ్లవర్‌ గార్డెన్స్‌ ఏర్పాటుకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి మరిన్ని హంగులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అడిగినా అడగపోయినా పని చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే.. ఎల్‌బీనగర్‌ చౌరస్తా ఎట్లా ఉండే? ఇప్పుడు ఎలా ఉన్నదో ఈ ఒక్క ఉదాహరణ, నిదర్శనం అని చెప్పవచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *