హైదరాబాద్ లోని నాగోల్ ఫ్లైఓవర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర వాసులకు మౌలిక వసతులు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. దీనిలో భాగంగా వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం కింద రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని… మొదటి దశలో ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో 16 ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. రెండవ దశలో మరో 12 ప్రాజెక్టులను చేపడతామని మంత్రి వివరించారు. ఇప్పటి వరకూ 32 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 16 ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నాగోల్‌లో రూ.143 కోట్ల ఖర్చుతో 990 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను ఆరు లైన్లతో నిర్మించామని, ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ప్రజలు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రయాణం చేయవచ్చన్నారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీ నగర్ మీదుగా ఉప్పల్ వరకు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు సులభతరం కానున్నాయన్నారు. ఎల్బీనగర్ జంక్షన్ దగ్గర అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగుతోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు మరో నాలుగు ఫ్లైఓవర్లు కూడా సిద్దమవుతాయని వెల్లడించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులను పూర్తి చేశామని, రూ.600 కోట్ల వ్యయంతో తాగునీటి సమస్య లేకుండా చేశామని మంత్రి తెలిపారు. భారత్ లోనే గ్రేటర్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు ఉండేలా నగరంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంతో ప్రపంచంలోనే చాలా నగరాలను వెనక్కి నెట్టి ‘వరల్డ్ గ్రీన్ సిటీ’గా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న రిజిస్ట్రేషన్లు, పట్టాల సమస్య పరిష్కారాలకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో జీవో ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం.. ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ చేద్దాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ హాజరయ్యారు.
