mt_logo

బన్సీలాల్‌పేట చారిత్రక మెట్లబావిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

నిజాం కాలంలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నిర్మించి, కాలక్రమేణా దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన చారిత్రక బన్సీలాల్‌పేట మెట్లబావి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో పునరుజ్జీవం పొందింది. రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ చొరవతో గొప్ప పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకున్న ఈ మెట్లబావిని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.

సికింద్రాబాద్‌ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్‌పేటలోని మెట్ల బావిని అసఫ్‌-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్‌ పాలనాధికారి, రెసిడెంట్‌ అధ్యక్షుడు టీహెచ్‌ కీస్‌ ఈ బావిని 1933లో పునరుద్ధరించారు. అందుకు సేట్‌ బన్సీలాల్‌ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్‌పేట్‌ అని నిలిచిపోయింది.

ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. దాదాపు 5 వందల మెట్రిక్‌ టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు బయట పడ్డాయి. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్టు ఫౌండర్‌ కల్పన రమేశ్‌ చెప్పారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతున్నది. బావి చుట్టు పక్కల ప్రాంతాలలో బోర్లన్నీ భూగర్భ జలాలతో నిండుగా ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మెట్లబావిని పునరుద్ధరించడానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రొత్సాహం అందించడంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డితో కలసి అనేక సార్లు పర్యటించారు. బావిలో నుంచి పూడికతీత, చుట్టూ సీసీ రోడ్లు జీహెచ్‌ఎంసీ పూర్తి చేయగా, బన్సీలాల్‌పేట్‌ ప్రధాన ద్వారం, బాహ్య కట్టడాల పరిరక్షణ చర్యలను హెచ్‌ఎండీఏ చేపట్టింది. అలాగే, బావి పక్కనే ఉన్న మైదానంలో పాత భవనం తొలగించి, కొత్తగా టూరిస్ట్‌ ప్లాజా భవనం నిర్మించి, ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ను తీర్చిదిద్దారు. ప్రతి ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక ఓపెన్‌ యాంపీ థియేటర్‌, బావిలో నుంచి వెలికితీసిన పురాతన పరికరాల ప్రదర్శన, బావి చరిత్రను వివరించే ఫొటో ప్రదర్శనకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అద్భుతంగా తీర్చిదిద్దిన మెట్ల బావి గురించి ప్రధాని మోదీ ‘మన్‌ కీ బాత్‌’లో ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *