mt_logo

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్‌ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు మంచి ఫలితాలనిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఫ్లైఓవర్స్ ఒక్కొక్కటీ అందుబాటులోకి వస్తూ… ట్రాఫిక్ సమస్యలు చెక్ పెడుతున్నాయి. కాగా నేడు గచ్చిబౌలి లోని శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్‌పైకి చేరడానికి కేవలం 10 నిముషాలు మాత్రమే పడుతుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది.

ఎస్‌ఆర్‌డీపీ పథకంలో జీహెచ్‌ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్‌ఎండీఏ, ఆర్‌అండ్‌బీ, నేషనల్‌ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. మొత్తం 47 పనుల్లో 32 పనులు పూర్తి కాగా మరో 15 పనులు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తయిన 32 పనుల్లో 16 ఫ్లై ఓవర్లు, 5 అండర్‌ పాసులు, 7 ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, కేబుల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి, పంజాగుట్ట వైడెనింగ్‌, ఓఆర్‌ఆర్‌ నుంచి మెదక్‌ రిహబిటేషన్‌ పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపారు. 17వ ఫ్లై ఓవర్‌ అయిన గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ మొత్తం రూ.466 కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున చేపట్టిన ఈ శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మీదుగా ఉండటం గమనార్హం.

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు ఔటర్‌ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అకడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్య తప్పనున్నది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్‌ చెరువు, కోకాపేట్‌, నార్సింగ్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్‌ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి గ్రేడ్‌ సపరేట్‌ మరొక ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *