mt_logo

హైదరాబాద్ ఐటీఐఆర్ రద్దు చేసిన కేంద్రం… కుటిల రాజకీయమన్న మంత్రి కేటీఆర్

హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం కుటిల రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్‌ రద్దు చేసిందని ఆరోపించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.

ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దుతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందన్న కేటీఆర్, ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసింది ఏమీ లేదన్నారు. 2008 లో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదన చేసి, 2013లో దానికి ఆమోదం తెలిపినా, అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే తెలంగాణపై పగబట్టిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరె హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా పక్కన పెట్టిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు తాను కూడా వివిధ సందర్భాల్లో ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో పాటు కేంద్ర మంత్రులను ఐటీఐఆర్ గురించి అడిగానని, ఎన్నిసార్లు కోరినా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. మోడీ ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని గుర్తించే ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ… మోదీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకో సిస్టమ్‌కు నయా పైసా సహాయం చేయలేదని కేటీఆర్ విమర్శించారు.

కేంద్రానికి హైదరాబాద్ ఐటీ పరిశ్రమ అభివృద్దిపైన చిత్తశుద్ధి లేకనే, ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయం చూపలేదని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలైన నోట్ల రద్దు, కరోనా లాక్ డౌన్, పాలసీ పారలసిస్‌లతో ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక సంక్షోభంలోనూ దేశ సగటును మించిన అద్భుతమైన ప్రగతిని తెలంగాణ ఐటీ పరిశ్రమ సాధించిందన్నారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు కనుకే ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మోదీ ప్రభుత్వం, రాజకీయంగా గెలవలేమనే కారణంతోనే ఐటీఐఆర్‌ను రద్దు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఆధునిక భారత్ ను నిర్మించడంపై తమకున్న విధానపర అశక్తతను పార్లమెంట్‌లో ఒప్పుకుని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఐటీ పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలను చూపి రద్దు చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికున్న విధానపరమైన నిబద్ధతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు లెక్కలేనన్నీ కేంద్ర పథకాలను మంజూరు చేసుకుంటూ, తెలంగాణకు వస్తున్న చారానా, ఆఠానా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమన్నారు. ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటీ రంగ ప్రగతిని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈ మధ్యనే ప్రకటించిన సాఫ్ట్ వేర్ పార్కులే సాక్ష్యం అన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, పంజాబ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలకు సాఫ్ట్ వేర్ పార్క్‌లను కేటాయించిన కేంద్రం తెలంగాణకు మెండిచేయి చూపిందని ధ్వజమెత్తారు. ఇలా తెలంగాణ ఐటీ రంగంతోపాటు, అన్ని అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం విధానాలను ఇక్కడి యువత గమనించాలని కోరారు. మరోపైపు కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ, వివక్ష చూపుతున్న ఉపాధి కల్పనలో తెలంగాణ ముందువరుసలో ఉన్న విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ప్రత్యేకంగా ఐటీఐఆర్‌కు సమానంగా ఒక పథకాన్ని లేదా ప్యాకేజీని ప్రకటించి తెలంగాణ పట్ల తమ నిబద్దత చాటుకోవాలని కేటీఆర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *