బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ… ‘మేం కేవలం నినాదాలు ఇవ్వలేదు. ఫిట్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా అనేక అందమైన నినాదాలు బీజేపీ ఇస్తది. కానీ దాని వెనుక పాలసీలు ఉండవు. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఆత్మనిర్భర్ కింద రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది. దీంతో దేశంలోని పరిశ్రమలకు లాభం జరుగుతందని అనుకున్నాం. ఆ ప్యాకేజీ ఎక్కడ పోయిందో తెలవదు. అవి నోటి మాటలే. నాకు తెలిసీ ఒక్కరంటే ఒక్కరూ కూడా లాభం పొందలేదు. బీజేపీవి పచ్చి బోగస్ మాటలు’ అని కేటీఆర్ మండిపడ్డారు. భారతదేశంలోని కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలోనే ఈ విషయం వెల్లడైందన్నారు. భౌగోళికంగా 11వ పెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రం. కానీ భారతదేశ ఆర్థిక రంగానికి 4వ అతిపెద్ద చోదక శక్తిగా ఉందని ఆర్బీఐ నివేదికలో తేలిందన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనతనే అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 2 లక్షల 78 వేలు(130 శాతం) పెరిగిందని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. జీఎస్‌డీపీ రూ. 11 లక్షల 54 వేల కోట్లు.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉందా? అని కేటీఆర్ అడిగారు. కానీ ఇది కొందరికి నచ్చడం లేదు. తెలంగాణ పచ్చబడుతుంటే.. కండ్లు ఎర్రబడుతున్నాయి. రాజకీయంగా పుట్టగతులుండవని భయపడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.