లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్… యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. డెలాయిట్, హెచ్‌ఎస్‌బీసీ, జేసీబీ, ఈ అండ్ వై, రోల్స్‌రాయిస్ తదితర అంతర్జాతీయ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రగతిశీల పారిశ్రామిక విధానాలను కేటీఆర్ వివరించారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, లైఫ్‌సైన్స్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడి అవకాశాల గురించి వారికి తెలియజేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్తు, మానవ వనరుల లభ్యతకు కొదవ లేదని తెలిపారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ఇచ్చే ప్యాకేజీ ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.