mt_logo

నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ చలించిపోయారు : మంత్రి కేటీఆర్

కేసీఆర్ ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయనంతగా కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటివరకు రూ. 5752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు.

నూలు, రసాయనాల మీద 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నల డిజైన్లను ఎవరైనా కాపీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు  37 వేల వరకు మర మగ్గాలు, 16 వేల వరకు చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని మంత్రి తెలిపారు.  దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా రైతు బీమా లాగానే చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం బీమా ఇస్తోందని, దురదృష్టవశాత్తు ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు బీమా చెల్లిస్తున్నామని తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు నెలకి రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పద్మశాలిల కోసం కోకాపేటలో పద్మశాలి ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. 

 నారాయణపేటలో చేనేత పార్కు పెడుతామని అమిత్ షా ఆరేండ్ల కింద చెప్పారు. ఇప్పటి వరకు అతీగతి లేదు. బీజేపీ నాయకుల మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. చేనేతలకు అండగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తుందని మండిపడ్డారు. చేనేతల చేయూతల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు అమలు చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ అనేక పథకాలను ఎత్తి వేశారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయని విధంగా చేనేతపై ఐదు శాతం జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీ అని విమర్శించారు. అవసరమైతే చేనేత రుణమాఫీకి మరోసారి ఆలోచిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *