కండరాల బలహీనతతో దీర్ఘకాలంగా అవస్థలు పడుతున్న ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారికి మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితుల తల్లిదండ్రులతో మంత్రి కేటీఆర్ ఫోన్‌లో స్వయంగా మాట్లాడి, అన్నివిధాలా ఆదుకొంటామని భరోసా కల్పించారు. వారికి చికిత్స అందించడానికి ప్రముఖ జనెటిక్ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మిని బాధితుల ఇంటికి పంపించినట్టు మంత్రి ట్విట్టర్‌లో తెలిపారు. కేటీఆర్ ఆదేశాల మేరకు పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి అధికారులు, వైద్యులతో కలిసి వెళ్లి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకొని రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు.
వివరాల్లోకి వెళితే…
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలానికి చెందిన వెంకటయ్య, శకుంతల దంపతులు కొన్నేండ్ల క్రితం నగరానికి వలసవచ్చి మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ చెన్నారెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వెంకటయ్య ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా, ముగ్గురు ఆడపిల్లలకు మస్క్యులర్ డిస్ట్రోపి (కండరాల బలహీనత) వ్యాధి సోకింది. రెండో కూతురు ప్రేమలత (31), మూడో కూతురు స్వర్ణలత (29), నాల్గవ కూతురు మనీష (22) నిస్సహాయక స్థితిలో ఇంటికే పరిమితమయ్యారు. కనీసం వారి పనులు వారు చేసుకోలేకపోవడమే కాకుండా నిలబడలేకపోతుండటంతో తల్లిదండ్రులే అన్ని సపర్యలు చేయాల్సి వస్తున్నది. వయసు పెరుగుతున్న కొద్దీ వీరి ఆరోగ్యంలో మార్పులు వస్తుండటంతో నిమ్స్, గాంధీ దవాఖానల్లో చికిత్స చేయించినా ఫలితం లేకపోగా వ్యాధి తీవ్రమవుతున్నది. అసలే అంతంతమాత్రం సంపాదనతో నెట్టుకొస్తున్న వెంకటయ్యకు.. ముగ్గురు కూతుళ్లకు వైద్యం చేయించకలేక ఆర్థికంగా మరింత కుంగిపోతున్నారు. ఈ వ్యాధికి మందులు లేవని, ఇది చాలా అరుదుగా సోకుతుందని వైద్యులు చెప్పారని వెంకటయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వంతోపాటు దాతలు సహకరించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకోగా… సామజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వారికి సహాయం అందించడమే కాకుండా.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.