mt_logo

3డీ ప్రింటింగ్ పరిశ్రమల హబ్‌గా హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ 

రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నగరం 3డీ ప్రింటింగ్ పరిశ్రమకు హబ్‌గా మారనున్నదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో జరిగిన ఆమ్టెక్‌ ఎక్స్‌పోలో మంత్రి కేటీఆర్ మట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 3డీ ప్రింటింగ్‌, ఆవిష్కరణ రంగంపై ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి చెప్పారు.

భారత్‌లో టెక్నాలజీని అభివృద్ధి చేసి విదేశాలకు అందించడానికి తాము కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మెడికల్, ఇండస్ట్రీ రంగాల్లోనూ 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు. రానున్న రెండు రోజులు దేశవిదేశాలకు చెందిన 100కు పైగా పరిశ్రమలు, 50కి పైగా స్టార్టప్‌లు, 15కు పైగా నేషనల్ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు, 3000 మందికి పైగా ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొంటారని చెప్పారు.

హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, వైద్య పరికరాలు తదితర సదుపాయాల అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్టార్టప్‌లకు, నూతన ఆవిష్కరణలకు, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రోత్సహం ఇస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు, సహకారంతో రాష్ట్రంలో టీ-హబ్, టీఎస్‌ఐసీ, వీ-హబ్‌, టాస్క్‌ వంటి స్టార్టప్‌లతో సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందినదన్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్‌ ఇటీవల వార్తల్లో నిలిచిందని, స్కైరూట్ ఏరోస్పేస్‌ సంస్థ త్రీడీ ప్రింటెడ్‌ ఇంజిన్‌తో కూడిన ఓ ప్రైవేట్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిందని కేటీఆర్ గుర్తుచేశారు. దేశంలో తొలి ప్రైవేట్‌ రాకెట్‌ ప్రయోగంగా అది గుర్తింపు పొందిందని చెప్పారు. వివిధ పరిశ్రమలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు.. తెలంగాణ ప్రభుత్వాన్ని తమ పారిశ్రామిక భాగస్వామిగా చేసుకోవాలని మంత్రి కోరారు. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మంచి స్పేస్ ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *