సంక్షేమ పథకాలను ఉచిత పథకాలుగా పేర్కొంటూ వాటిని వద్దు అని చెప్తున్న బీజేపీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించి రాజకీయంగా సమాధి చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ‘‘బోరు బావులకు మీటర్లు పెట్టమని బీజేపీ లెటర్ పంపింది. అన్నదాతలు జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి. వడ్లు కొనమంటే చేతకాని దద్దమ్మలు బీజేపీ వాళ్లు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని చెప్పి అవమానించారు. గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసింది. ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనాలని చూశారు. కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ పెద్దలు ముఖం చాటేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. నవంబర్ 6న టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది’’ అని పేర్కొన్నారు.
భగీరథ ద్వారా ఇంటింటికీ నదీ జలాలను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరూ నడవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన మహానుభావుడు మన కేసీఆర్ అని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలవాలంటే టీఆర్‌ఎస్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తే సాగు నాటి ప్రాజెక్టులు పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందిస్తామన్నారు. మహిళా భవనాలను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.