mt_logo

నార్సింగిలో టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి హ‌రీశ్‌రావు

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని నార్సింగిలో టీ – డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌ను విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. టీ డ‌యాగ్నోస్టిక్ మొబైల్ యాప్‌ను కూడా మంత్రి ఆవిష్క‌రించారు. వైద్య ప‌రీక్ష‌ల వివ‌రాల‌ను మొబైల్ యాప్‌లోనే తెలుసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. బ‌స్తీ ప్ర‌జ‌ల‌కు వైద్యం అందుబాటులోకి రావాల‌నే ఉద్దేశంతో విప్ల‌వాత్మ‌క‌మైన చ‌ర్య‌ల‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టార‌ని తెలిపారు. ఒక‌ప్పుడు ఉస్మానియా, గాంధీతోపాటు పీహెచ్‌సీల‌కు వెళ్లేవారని, ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బ‌స్తీల్లోని నిరుపేద‌ల‌ కోసం 350 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేశామన్నారు. ర‌క్త‌, మూత్ర‌, ఎక్స్‌రేతో పాటు ఇత‌ర ప‌రీక్ష‌ల నిమిత్తం ప్ర‌భుత్వం టీ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. హైద‌రాబాద్‌లో 20 రేడియోల‌జీ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకో, మెమోగ్ర‌ఫీ సేవ‌ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని తెలిపారు.

టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ఉచితంగా 57 ర‌కాల ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్‌లో టీ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో 137 ప‌రీక్ష‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. టీ డయాగ్నోస్టిక్ సెంట‌ర్‌లో ఇప్ప‌టికే 24.71 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని పేర్కొన్నారు. టీ డ‌యాగ్నోస్టిక్స్ ల్యాబ్‌ల కోసం యాప్ ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. వైద్య ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను యాప్‌లో ఎప్పుడైనా తెలుసుకోవ‌చ్చు. పెరిగిన అవ‌స‌రాల మేర‌కు న‌గ‌రంలో 4 కొత్త ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే కిడ్నీ, లివ‌ర్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స‌ల‌తో పాటు ఉచితంగా మోకాళ్ల మార్పిడి శ‌స్త్ర చికిత్స‌ అందిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *