రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫీవర్ సర్వే వారం రోజుల్లో పూర్తిచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతున్న ప్రక్రియను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, తదితర అధికారులతో కలిసి ఖైరతాబాద్‌లోని హిల్‌టాప్ కాలనీలో సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం చేపడుతున్న ఫీవర్ సర్వేకు సహకరించాలని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ -19 మూడో విడత నివారణకు పకడ్భంది చర్యలను చేపట్టామని, వైద్య సిబ్బంది కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నారని ఆయన వివరించారు. కరోనా మూడో వేవ్‌తో గానీ, ఒమిక్రాన్‌తో గానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కోటికి పైగా మెడికల్ కిట్‌లను సిద్ధంగా ఉంచామని, రోజుకు లక్ష కోవిద్ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. వైద్య పరీక్షల్లో కొవిడ్ లక్షణాలున్న వారికి వెంటనే 5 రోజులకు సరిపడ మందుల కిట్ అందజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా పూర్తి చేసే ఇంటింటి ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన సభ్యులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్కొక్క టీమ్‌లో ఆశా కార్యకర్త, ఎఎన్ఎం, మున్సిపల్, పంచాయతీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో బాధపడుతున్న వారిని గుర్తించి, ఒకవేళ కొవిడ్ లక్షణాలు తేలితే వారికి వెంటనే మెడికల్ కిట్‌ను అందజేస్తారని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటుతో కలిపి దాదాపు 56 వేల పడకలు ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 4846 కాలనీల్లో, బస్తీల్లో కూడా ఇంటింటి సర్వే విజయవంతంగా ప్రారంభమైందని సీఎస్ పేర్కొన్నారు. గతంలో రెండు విడతలుగా నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే విజయవంతం కావడంతో పాటు సత్ఫలితాలనిచ్చిందని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం చేపట్టిన ఈ ఇంటింటి జ్వర సర్వేను నీతిఆయోగ్ కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో వాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా నడుస్తోందని, 60 ఏళ్ళు దాటిన వారు తప్పని సరిగా బూస్టర్ డోస్ వేసుకొవాలని సీఎస్ సూచించారు.
.
సర్వేలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు :
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటి ఫీవర్ సర్వేలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి స్వయంగా వెళ్లిన మంత్రి హరీష్ రావు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే ఆరోగ్య సిబ్బందికి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. వ్యాక్సినేషన్ గురించి అడుగుతూ, మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.