ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 లక్షల రైతు కుటుంబాల తరపున ప్రజాప్రతినిధులుగా వచ్చిన ఎంపీలను ‘మీకేం పనిలేదా?’ అని అవమానించడం దారుణమన్న హరీశ్‌రావు.. ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా యావత్ తెలంగాణ ప్రజలను గోయల్ అవమానపరిచారని, ఈ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్‌రావు.. గోయల్ ఒక కేంద్రమంత్రిగా హుందాగా వ్యవహరించకుండా ఫక్తు రాజకీయనేతగా ప్రవర్తించారని హరీశ్ విమర్శించారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రులు రావడం కంటే.. పెద్ద డెలిగేషన్ ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని ముందుగా కలువకుండా.. ముందుగా పార్టీ నేతలను పిలిపించుకొని మాట్లాడటం వెనుక మతలబేమిటని నిలదీశారు. అబద్ధాలు, అభాండాలు, గోబెల్స్ ప్రచారాలతో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు.
రైతులే మాకు ముఖ్యం :
తెలంగాణ ప్రభుత్వం.. మంత్రులు, ఎంపీల మొదటి ప్రాధాన్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల ప్రయోజనాలేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రాజకీయమే ప్రాధాన్యంగా ఉన్నదని విమర్శించారు. వానకాలంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్ 40 లక్షల టన్నుల సేకరణ పూర్తయిందని.. మరో పది లక్షలు అదనంగానే సేకరించామని.. ఇంకా అదనంగా 30 లక్షల టన్నులు వచ్చేలా ఉన్నదని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని కొంటారా? కొనరా? అని అడగడానికి వచ్చిన మంత్రులను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతులను రోడ్డుమీదికి తెచ్చింది బీజేపీ :
రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా? అని మంత్రి హరీశ్ బీజేపీని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకొని.. రైతులను రోడ్డు పైకి తేవడం బీజేపీ కుటిలనీతికి నిదర్శనమని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు సరఫరా, సాగునీరు రాష్ట్రాల బాధ్యత అని.. వాటిని తాము వందశాతం నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు కింద ఏడాదికి 14 వేల కోట్ల పెట్టుబడి సాయం, సాగునీరు, రైతుబీమా అందించామని, గోదాములు నిర్మించి, మార్కెట్లను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలోనిదన్న హరీశ్‌రావు.. ఇప్పుడు ఆ బాధ్యతను విస్మరిస్తున్నదని మండిపడ్డారు. పంటల సేకరణ, ఎగుమతులు, దిగుమతుల బాధ్యతలను నిర్వహించడం చేతకాకపోతే రాష్ర్టాలకు అధికారాలు బదిలీ చేయాలని సూచించారు. కేంద్రం చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అబద్ధాలకోరు :
వానకాలం ధాన్యం కొనుగోలు, వచ్చే యాసంగి సేకరణ గురించి మాట్లాడకుండా గత వానకాలం, యాసంగి బియ్యాన్ని తెలంగాణ ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వ్యాగన్లు, గోదాములు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు చెప్తే.. ‘మీరు ఒక లేఖ అయినా రాశారా’ అని కేంద్రమంత్రి ప్రశ్నించడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో తాము పది లేఖలు రాశామని చెప్తూ.. వాటిని మీడియాకు చూపించారు. ‘బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్ పర్సన్‌ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో’ అని చెప్తే పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా దొంగే.. దొంగ.. దొంగ అన్నట్టు కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము కేంద్రం దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి రాలేదని స్పష్టంచేశారు. కేంద్రం బాధ్యతను గుర్తు చేసేందుకు వచ్చామన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తుత బీజేపీ సర్కారే వడ్లు కొనడంలేదని.. గతంలో ఏ ప్రభుత్వమున్నా ధాన్యం కొన్నదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి రైతులకు భరోసా కల్పిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల జీవితాలతో ఆడుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని సేకరించకుండా వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై నెట్టాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ రైతులు, ప్రజలు అర్థం చేసుకొని బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.
రైతుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు :
కొత్త రాష్ట్రమన్న ఆలోచన లేదు. దశాబ్దాలపాటు వ్యవసాయం దెబ్బతిని ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నదన్న ధ్యాస లేదు. ఒకప్పుడు ఆత్మహత్యలతో అతలాకుతలమయ్యారన్న సానుభూతి లేదు. ఆదుకుందామన్న ఆర్తి అంతకంటే లేదు. ఎకసెక్కం మాటలు. ఎత్తిపొడుపు చేష్టలు. తెలంగాణ- రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆటలు. వచ్చే యాసంగి వడ్లు కొనబోమని తేల్చిచెప్పిన కేంద్రం, ఈ వానకాలం ధాన్యం ఎంత తీసుకుంటారని అడిగితే, మొత్తం తీసుకుంటామన్నది. అదే విషయాన్ని రాసివ్వాలంటే మాత్రం రాసివ్వదు. రేపు చెప్తామని మంగళవారం మాట ఇచ్చిన కేంద్ర మంత్రి గోయల్ మళ్లీ మాట తప్పారు. మిల్లుల నుంచి వచ్చిన ధాన్యాన్ని నిల్వచేసుకునే గోదాముల్లేక, తరలించుకునేందుకు రైల్వే ర్యాకుల్లేక, విషయంపై అవగాహన లేక చేతు లెత్తేసిన కేంద్రం ఎదురుదాడినే ఏకైక మంత్రంగా ఎంచుకున్నది. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ – రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ అసలు సమస్యను పక్కదోవ పట్టించేందుకు సోషల్‌మీడియాలో వంతపాడుతున్నది. కేంద్రం ఏదో ఒకటి తేల్చేదాకా ఢిల్లీలోనే ఉండి ఒత్తిడి తేవాలని, ప్రధాని మోదీని కలిసేందుకు కూడా ప్రయత్నించాలని రాష్ట్ర మంత్రులు భావిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్, విప్ గువ్వల బాలరాజు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.