మెట్రోపొలిస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి బేగంపేట ఎయిర్ పోర్టులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. హైటెక్స్ లో జరుగుతున్న మెట్రోపోలిస్ సదస్సులో రాష్ట్రపతి ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పట్టణాలు, నగరాల్లో మురికివాడల స్థానంలో శాటిలైట్ టౌన్ షిప్ లు రావాలని, త్వరలో పట్టణ జనాభా 50 శాతం చేరుకోనుందని అన్నారు. నగరాల్లో ఉన్న అతి కొద్ది భూమిని సద్వినియోగం చేసుకోవాలని, నగరాల్లోకి వలసలు పెరుగుతున్న కొద్దీ భూమి లభించడం తగ్గుతూ వస్తుందని, పాతబస్తీలో ఇస్తాంబుల్ తరహాలో నిర్మాణాలుండాలని చెప్పారు.
మెట్రోపొలిస్ సదస్సుకు హాజరైన ప్రపంచ ప్రతినిధులకు రాష్ట్రపతి ప్రణబ్ అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ, నగరాలకు కాలుష్య సమస్య పెనుసవాలుగా మారిందని, 19 వ శతాబ్ధం నుండి పట్టణీకరణ చాలా వేగంగా సాగుతోందన్నారు. 21 వ శతాబ్దం నగరాలదే అని, నగరాల్లో రవాణా, విద్యుత్, తాగునీరు లాంటి సౌకర్యాలను విస్తరించాలని చెప్పారు. పట్టణాలు నగరాల్లో పారిశుధ్య వ్యవస్థను ఆధునీకరించాలని, వచ్చే ఐదేళ్ళలో స్వచ్ఛ భారత్ ను విజయవంతం చేయాలని, కాలుష్య నివారణకు హరితవనాలను పెంచాలని, కర్బన రహిత వస్తు వినియోగం పెంచాలని రాష్ట్రపతి సూచించారు.