మెట్రో రైలు ప్రాజెక్టుపై సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ముందుగా ప్రతిపాదించిన అలైన్ మెంట్ లో మూడు మార్పులు సూచించినట్లు, హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలకు అంతరాయం కలగకుండా మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.
అమరవీరుల స్థూపం పవిత్రతను కాపాడేందుకు అసెంబ్లీ వెనుకభాగం నుండి మెట్రో రైలు రూట్ మార్చాలని సూచించినట్లు, సుల్తాన్ బజార్ దగ్గర ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ కు బదులుగా బడిచౌడి ఉమెన్స్ కాలేజీ వెనుకభాగం ద్వారా ఇమ్లిబన్ కు చేరేవిధంగా కొత్త రూట్ ఉండాలని అధికారులకు సూచించినట్లు కేసీఆర్ తెలిపారు. పాతబస్తీలో ప్రస్తుతం ఉన్న అలైన్ మెంట్ ప్రకారం మెట్రో నిర్మాణం చేపడితే ఏడు హిందూ దేవాలయాలు, 28 ముస్లిం ప్రార్ధనా మందిరాలు, వెయ్యి నివాస గృహాలు దెబ్బతింటాయని, వీటన్నింటికి విఘాతం కలుగకుండా నిర్మాణం చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు.