mt_logo

మేమే చెల్లిస్తాం..

-లక్షలోపు వ్యవసాయ రుణాల మాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ కీలక నిర్ణయం
-మార్గదర్శకాలు విడుదల చేస్తూ జీవో
-మాట నెరవేర్చిన సీఎం కేసీఆర్
-నెలలోపే మండల బ్యాంకర్ల సమావేశం
-రుణం మొత్తాన్ని నివేదించనున్న బ్యాంకర్లు
-బ్యాంకులకు రీయింబర్స్ చేయనున్న ప్రభుత్వం
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నెరవేర్చారు. ఈ ఏడాది మార్చి 31వరకూ రైతులు తీసుకున్న లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రాష్ట్ర రైతాంగం ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న రుణాలలో లక్ష రూపాయల మొత్తాలను తానే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మొత్తాన్ని బ్యాంకులకు రీయింబర్స్ చేయనుంది. వెంటనే రైతులకు కొత్త రుణాలను అందించాలని కూడా బ్యాంకులను కోరింది. అర్హులైన రైతులందరి జాబితాలను రూపొందించి రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నందున వారందరికీ ఈ ఖరీఫ్ సీజన్‌లోనే ప్రయోజనం కలుగనుంది.

రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య విడుదల చేశారు. రైతులు తీసుకున్న రుణాలు, వడ్డీలు కలుపుకొని లక్ష రూపాయలకు మించకుండా అర్హులైన వారందరికీ రుణ మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన రైతుల జాబితాను రూపొందించే విధివిధానాలకు సంబంధించిన ఫార్మాట్‌లను కూడా జీవోలోనే పొందుపర్చారు. వాటిని బ్యాంకు అధికారులకు అందించాలని కూడా ఆదేశించారు. రుణమాఫీ ప్రక్రియలో కీలకమైన మండల స్థాయి బ్యాంకర్ల సమావేశం నెలలోపే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.

బ్యాంకులకు ప్రభుత్వం ఇలా చెల్లిస్తుంది..
మాఫీ చేసిన మేరకు రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించే విధానాన్ని కూడా జీవోలో పొందుపర్చారు. గ్రామాలవారీగా, జిల్లాలవారీగా అర్హులైన రైతుల జాబితా తయారుచేసిన తర్వాత జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమవుతుంది. మాఫీ అయ్యే మొత్తం రుణం ఎంతో లెక్క తీస్తుంది. వివిధ జిల్లాల రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ మొత్తాన్ని వర్తింపజేసి.. సదరు నిధులను బ్యాంకులు ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని బ్యాంకులకు రీయింబర్స్ చేస్తుంది. ఆ తర్వాత జీవోలో పేర్కొన్న ప్రొఫార్మా ప్రకారం రైతులకు రుణ మాఫీ సర్టిఫికెట్‌ను ప్రభుత్వం అందిస్తుంది.

నెల రోజుల్లోపే మండల స్థాయి బ్యాంకర్ల సమావేశం
మండల స్థాయిలో బ్యాంకర్ల కమిటీ సమావేశం నెలలోపే జరగాలని కూడా ఈ జీవోలో ప్రభుత్వం నిర్దేశించింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత ఆడిటింగ్ చేస్తారు. రిజర్వ్ బ్యాంకు, నాబార్డు నిర్దేశాలకు లోబడి ఈ ఆడిటింగ్ ఉంటుంది. అర్హులైన రైతుల జాబితా తయారుచేయడంలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బ్యాంకు లేదా రుణం ఇచ్చిన సంస్థలకే ఉంటుందని కూడా జీవోలో స్పష్టం చేశారు. ఈ మేరకు రూపొందించిన ప్రతి డాక్యుమెంట్ లేదా జాబితా లేదా జారీచేసిన ధ్రువీకరణ పత్రాలపై ఆయా బ్యాంకు అధికారుల సంతకం తప్పని సరని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేందుకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు వచ్చిన వినతి పత్రాలను కూడా 30 రోజులలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేకంగా ఆదేశాలు కూడా వెలువడనున్నాయి.

రుణమాఫీతో కొత్త రుణాలకు అవకాశం
తెలంగాణ రాష్ట్ర స్థూల ఆదాయంలో 14% వ్యవసాయరంగం నుంచే అందుతుంది. గ్రామీణ ప్రాంతంలో 50% జనాభా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. జీఎస్‌బీపీలో వ్యవసాయరంగం వాటా తక్కువగా ఉన్నప్పటికీ అధిక జనాభాకు ఈ రంగంలో ఉపాధి లభిస్తుందని జీవోలో ప్రస్తావించారు. కరువు పరిస్థితులు, తక్కువ ఉత్పాదకత తదితర కారణాల వల్ల రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నదని, ఈ పరిస్థితిని గుర్తించి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతులకు రుణ మాఫీని చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల రైతాంగానికి కొత్తగా వ్యవసాయ పెట్టుబడులు లభించే అవకాశముందని వివరించారు. రుణమాఫీ పథకం రైతులు సంస్థాగతంగా అంటే బ్యాంకులు, సహకార సంఘాలు, రూరల్ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని, వారు తీసుకున్న ఇతరత్రా రుణాలకు వర్తించదని జీవోలో పేర్కొన్నారు. రైతులు వాణిజ్య బ్యాంకులు, సహకార పరపతి సంఘాలు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల నుంచి స్వల్పకాలిక, పంట రుణాలు, బంగారం తాకట్టు రుణాలు తీసుకుంటారని, వాటి నుంచి రైతులు తీసుకున్న లక్షలోపు రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నట్లు జీవోలో ప్రతిపాదించారు. భార్య, భర్త, వారిపై ఆధారపడిన పిల్లలను ఒక కుటుంబంగా పరిగణిస్తారు. కుటుంబ సభ్యులు వేర్వేరు బ్యాంకుల్లో తలాకాస్త వ్యవసాయ రుణం తీసుకుంటే.. అవి లక్షలోపు ఉంటే వాటన్నింటినీ మాఫీ చేస్తారు. 2014 మార్చి 31 వరకు తీసుకున్న రుణం (వడ్డీ కూడా కలిపి)కు ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని తనఖాపెట్టి తీసుకున్న రుణం ఈ పథకం పరిధిలోకి రాదు. టైడ్ లోన్స్, ఇప్పటికే క్లోజ్ అయిన రుణ ఖాతాలు కూడా ఈ పథకంలో చేరవు. అలాంటి రైతులకు రుణమాఫీ పథకం వర్తించదని జీవో స్పష్టం చేసింది.

ఇవే మార్గదర్శకాలు:
1) రైతులకు రుణాలు అందించిన సంస్థ లేదా బ్యాంకు శాఖ ఒక్కో రైతువారీగా, గ్రామంవారీగా జాబితా తయారు చేస్తుంది. 2014 మార్చి 31 వరకు రైతులు తీసుకున్న పంట రుణాలను నిర్దిష్ట ఫార్మాట్‌లో పొందుపరుస్తారు.
2)అదేవిధంగా బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను కూడా నిర్దిష్ట ఫార్మాట్‌లో నమోదు చేస్తారు.
3) ఈ రెండు ఫార్మాట్‌లను ఆయా బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు పరిశీలించి లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారి జాబితాను మరో ఫార్మాట్‌లో క్రోడీకరిస్తారు. ఈ మూడు విధాలుగా రూపొందించిన ఫార్మాట్‌లను బ్యాంకు మేనేజర్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లకు, జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.
4)కొందరు రైతులు ఒకటికంటే ఎక్కువ బ్యాంకుల్లో లక్ష రూపాయలపైబడి పంట రుణాలు లేదా బంగారంపై రుణాలు తీసుకొని ఉంటారు. ఈ మేరకు డూప్లికేషన్‌ను తొలగించి లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతు కుటుంబాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు మండల స్థాయిలో బ్యాంకర్లు సమావేశమవుతారు. జాయింట్ మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ ఈ జాబితాలను తమ సమావేశంలో పెడతారు. వాణిజ్య బ్యాంకులతోపాటు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకుల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మండల తహశీల్దారు కూడా ఈ జాబితాలను పరిశీలిస్తారు. గ్రామం వారీగా అర్హులైన రైతుల తుది జాబితాను ఇక్కడ రూపొందిస్తారు. ఈ మేరకు మరో ఫార్మాట్‌లో రైతుల జాబితా రూపొందుతుంది. బ్యాంకు అధికారుల ఆమోద ముద్రతో ఈ జాబితాను లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.
5)జిల్లాస్థాయి సమావేశం ఆ తర్వాత జరుగుతుంది. దీంతో జిల్లాల్లో బ్యాంకుల వారీగా, రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా అర్హులైన రైతులకు చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *