mt_logo

మెదక్ ఉప ఎన్నికతో చంద్రబాబు బలమెంతో తేలాలి – హరీష్ రావు

మెదక్ ఉప ఎన్నిక తీర్పు ఢిల్లీ దిమ్మ తిరిగేలా ఉండాలని, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలని భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు మెదక్ జిల్లా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికతో చంద్రబాబుకు తెలంగాణలో ఉన్న బలం ఎంతో తెలియాలని, అప్పుడే కేంద్రం కళ్ళు తెరిచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాను ఇస్తుందని పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా నంగునూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రా సీఎం చంద్రబాబు ఆడించినట్టల్లా ఆడుతూ తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్న బీజేపీకి మెదక్ ప్రజలు ఉప ఎన్నికలో గట్టి గుణపాఠం చెప్తారన్నారు. చంద్రబాబు అడగ్గానే పోలవరం ముంపు గ్రామాలను ఏపీలో కలిపి లోయర్ సీలేరు ప్రాజెక్టు నుండి తెలంగాణకు రావాల్సిన 450 మెగావాట్ల విద్యుత్ ను ఇచ్చేందుకు చంద్రబాబు నిరాకరించినా కేంద్రం మౌనంగా ఉందని, హైదరాబాద్ పై ఆంక్షలు విధించిందని హరీష్ రావు విమర్శించారు.

ఉక్కు మనిషి అద్వానీని పార్టీ నుండి బయటికి పంపి తెలంగాణ ద్రోహి అయిన జగ్గారెడ్డికి టిక్కెట్ ఇచ్చిన బీజేపీకి ఓటు ఎందుకువేయాలని, ప్రజల నోటికాడి బుక్కను లాక్కున్న జగ్గారెడ్డి సంగారెడ్డిని బీదర్ లో కలపాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. మూడునెలల పాలనలో ఏం చేశారని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు శ్రీధర్ రెడ్డి, జీవన్ రెడ్డిలపై హరీష్ తీవ్రంగా మండిపడ్డారు. వడగండ్ల వానలతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా సీమాంధ్రలో నీలం తుఫాన్ బాధితులకు సీమాంధ్ర సర్కార్ అడిగినన్ని నిధులిస్తుంటే నోరుమెదపని తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రైతులకు సీఎం కేసీఆర్ 480 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేశారని, నంగునూరు ప్రభుత్వ దవాఖానకు 8.2 కోట్లను వైద్య, ఆరోగ్య శాఖామంత్రి టీ రాజయ్య విడుదల చేశారని, దసరా పండుగ నుండి వృద్ధులకు నెలకు 1000 రూపాయల పెన్షన్ అందుతుందని, లిఫ్ట్ ఇరిగేషన్ కు 8 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని చెప్పారు. ఉప ఎన్నికలో సిద్ధిపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టించాలని హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చాగండ్ల నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *