మెదక్ లోక్ సభ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న చర్చల అనంతరం తమ పార్టీ తరపున కొత్త ప్రభాకర్ రెడ్డి పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరుకూడా పరిశీలించినప్పటికీ త్వరలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రానికి, ఉద్యోగులకు అనుసంధానకర్తగా దేవీప్రసాద్ సేవలు అవసరం అని భావించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
నామినేషన్ల గడువు బుధవారంతో ముగియనుండటంతో తెలంగాణ భవన్లో పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం కేసీఆర్ అభ్యర్థి పేరును నిర్ణయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వెలువడగానే పార్టీ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి సోనీ ట్రావెల్స్ సంస్థను హైదరాబాద్ బాలానగర్ లో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయగా, బీజేపీ అభ్యర్థిగా తూర్పు జగ్గారెడ్డి పేరు ఖరారైంది.