మెదక్ లోక్ సభ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లాలో టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నిక ఈనెల 13 న జరగనుండటంతో 10 వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రసంగించనున్నారు. సీఎం పాల్గొనే సభ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సభ విజయవంతం అయ్యేలా భారీ ఏర్పాట్లు చేశారు. భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఈ సభకు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం చుట్టుపక్కలనుండి దాదాపు రెండు లక్షల మంది హాజరవుతారని, ప్రతి నియోజకవర్గం నుండి 25 వేల మంది, సభ జరగనున్న నర్సాపూర్ నియోజకవర్గం నుండి సుమారు 50 వేల మంది వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి హారీష్ రావు సభ భద్రతా ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్, ఎస్పీ షేమూసీ బాజ్ పాయ్ తో కలిసి మంగళవారం దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి మేడ్చల్, కాళ్ళకల్, తూఫ్రాన్, శివ్వంపేట మీదుగా నర్సాపూర్ చేరుకోనున్నారు.