హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు, సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన చక్కటి భోజనం పెట్టే సౌకర్యం కల్పించనుంది. మంగళవారం అందుకు సంబధించి హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వం తరపున టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్, స్వచ్ఛంధ సంస్థ హరె కృష్ణ మూమెంట్ సంస్థ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. రోగి సహాయకులకు ఐదురూపాయలకే నాణ్యమైన ఙోజనం మూడు పూటలా ప్రభుత్వం ఇక నుంచి అందించనుంది. జీహెచ్ఎంసీ లో 5 రూపాయలకే అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఇప్పటికే పేదలకు ఎలా భోజన సౌకర్యం అందిస్తున్నామో, అదేరీతిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఈ సౌకర్యం ఇప్పటి నుండి కలగనుంది.రోగి సహాయకులు ఒక ప్లేట్ భోజనానికి 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తే, ప్రభుత్వం హెరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ కు మిగతా మొత్తం 21.25 రూపాయలు చెల్లిస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఏటా 38.66 కోట్లు ఖర్చు చేయనుంది.
ప్రతిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో 18 ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులతో వారి సహాయకులు రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. రోగులకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించినప్పటికీ, రోగుల సహాయకులు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇది గమనించే ప్రభుత్వం రోగి సహాయకులకు సబ్సిడీ భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నీలోఫర్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, పెట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి, ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, కోటి ఈఎన్.టీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోటి మెటర్నటీ ఆస్పత్రి, గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోటి జిల్లా ఆస్పత్రి, మలక్ పేట ఎం.ఎన్ ఏరియా ఆస్పత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి, కోండాపూర్ ఏరియా ఆస్పత్రి, నాపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఐదు రూపాయల భోజన సౌకర్యం కల్పించనున్నాం. దీనివల్ల రోజుకు దాదాపు 20 వేల మందికి ఈ భోజన సదుపాయం కలగనుంది.