mt_logo

ఉద్యమంలో కలిసిరాని నేతల భరతం పట్టాలె: ప్రొఫెసర్ కోదండరాం

రాష్ట్ర సాధనకు అడ్డుపడుతూ, సీమాంధ్రులల పల్లకి మోస్తున్న తెలంగాణ ప్రజాప్రతినిధులను తరిమికొట్టే ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది’ అని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో విద్యార్థి సింహగర్జన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పాలమూరు విద్యార్థి సింహగర్జన, పది జిల్లాల విద్యార్థులకు సంకేతం కావాలన్నారు. విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్‌లో కంపెనీలు పెట్టినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఎక్కడ పరిశ్రమ పెట్టినా స్థానికులకు 80 శాతం ఉద్యోగాలిస్తారని, ఆ చట్టం ఇక్కడా అమలుచేయాలని డిమాండ్ చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గురించి ఏడో తరగతిలో చదువుతున్నామని, తెలంగాణ మహానుభావుల చరిత్ర పుస్తకాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు. ఊళ్లల్లో వలంటీర్లను తయారు చేసి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.

తెలంగాణ సాధన కోసం టీఎస్ జేఏసీ, ఏబీవీపీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతుంటే, సీమాంధ్ర పార్టీల నేతలు అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణవాదులది బతుకుదెరువు కోసం పోరాటమైతే, సీమాంధ్రులది సీఎం కుర్చీకోసం ఆరాటమని విమర్శించారు. సెక్రటేరియట్లో 90శాతం, ఢిల్లీలోని ఏపీభవన్‌లో 99 శాతం సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారని చెప్పారు. 12 ఏళ్లుగా అలుపెరగకుండా ఉద్యమిస్తున్న కేసీఆర్‌ను కించపరిస్తే, తెలంగాణవాదుల ఆగ్రహజ్వాలల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు.

జీ 24 గంటలు సీఈవో శైలేష్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా భూములను కబ్జా చేసి ప్రజలను పాలెగాళ్లను చేశారని, రంగారెడ్డి జిల్లా భూములను రంగులేసుకునే వారికి అప్పగించారని విమర్శించారు. పింఛన్ ఇస్తామని ఒకరు, నగదు బదిలీ అని మరొకరు తెలంగాణవాదాన్ని పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తేనే బతుకులు బాగుపడుతాయన్నారు. టీఎస్ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి మాట్లాడుతూ డిసెంబర్ 9న విద్యార్థి జేఏసీ తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను బొందపెడితేనే రాష్ట్రం సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో టీఎస్‌జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరాటే రాజు, టీ జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌డ్డి, టీఎస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మున్నూరు రవి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *