mt_logo

మే 16న స్వచ్ఛ హైదరాబాద్ ను ప్రారంభించనున్న గవర్నర్..

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేదిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముందుకు పోతున్నారు. మే 16వ తేదీన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ తో పాటు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, ఆనంద్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ పై విస్తృత ప్రచారం కల్పించడానికి పత్రికలు, టీవీలు, రేడియో, థియేటర్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్స్ తదితర సాధనాలు ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలను భాగస్వామ్యులను చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వివిధ ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, మల్టీప్లెక్స్ లు, హాస్పిటల్స్, వివిధ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ యంత్రాంగం వల్ల మాత్రమే సాధ్యం కాదని, ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలని, ఈ విషయంలో ప్రజలను చైతన్య పరచడానికి, వారిలో స్ఫూర్తి నింపడానికి సినీ నటులు, క్రీడాకారులు, ఇతర ప్రముఖులను రంగంలోకి దింపుతామని, సాంస్కృతిక కళా బృందాలు కూడా నగరమంతా ప్రదర్శనలు నిర్వహిస్తాయని చెప్పారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేసేందుకు మీడియా ప్రముఖ పాత్ర పోషించాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకోసం మే 6వ తేదీ తర్వాత ఈ కార్యక్రమానికి సంబంధించి న్యూస్ చానళ్ళు, పత్రికా ప్రముఖులతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశం ద్వారా హైదరాబాద్ నగరాభివృద్ధి, స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహణకు సూచనలు, సలహాలు వారి వద్ద నుండి స్వీకరించనున్నారు. హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చేందుకు రూ. వెయ్యికోట్లు ఖర్చు చేయనున్నారు. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో నిర్వహించాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఒక ప్రజా ఉద్యమంగా జరగాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *