ఫొటో: సమైక్యవాదులు దాడిచేసి”తెలుగుతేజం” యాత్ర బస్సు టైర్లలో గాలితీసేశారు.
—
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం కావడంతో సీమాంధ్ర నాయకులంతా ఒక్కరొక్కరుగా తమ ముసుగులు తీసేస్తున్నరు. పైకి ఏమి మాట్లాడినా తామంతా పచ్చి తెలంగాణ వ్యతిరేకులమని, సీమాంధ్ర పక్షపాతులమని స్పష్టంగానే చాటుతున్నరు.
ఆరు దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలపై ఎన్నడూ పెదవి విప్పలేదు నాగభైరవ జయప్రకాశ్ నారాయణ. అంతేకాదు డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణపై విషం చిమ్ముతూ మాట్లాడాడు. హుటాహుటిన డిల్లీ వెళ్లి డిసెంబర్ 23 ప్రకటన వచ్చేలా లాబీయింగు చేశాడు.
అదే మనిషి ఇప్పుడు నెలన్నర ఆందోళనలకే చలించిపోయాడు. “తెలుగు తేజం” పేరిట సీమాంధ్రలో ఒక యాత్ర మొదలుపెట్టాడు.
అందులో షరా మామూలుగా తెలంగాణపై విషం చిమ్మాడు. డిల్లీ తెలుగు జాతి మధ్య చిచ్చుపెట్టిందని, సీమ ప్రజలు తమ పౌరుషం చూపించాలని వారిని రెచ్చగొట్టాడాయన. తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులో సీమాంధ్రులకు విద్య, ఉపాధి అవకాశాలు దొరకవని అక్కడి ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతానికి పంచాలనే అర్థంపర్థంలేని డిమాండును ముందుకు తెచ్చాడు.
ఇవ్వాళ హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారిలో ఇతర రాష్ట్రాలవారు అనేకులు ఉన్నారు. రేపు తెలంగాణ ఏర్పడ్డ తరువాత కూడా హైదరాబాదులోని ప్రైవేటు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల వాళ్ల లాగానే ఆంధ్ర పౌరులు కూడా అర్హులు. కానీ నాగభైరవుడు మాత్రం ఆంధ్ర ప్రజలకు కొత్త భయాలు కల్పించి వారిని రెచ్చగొడుతున్నాడు.
ఇవ్వాళ హైదరాబాదులో పన్ను వసూళ్లు ఎక్కువ ఉన్న మాట వాస్తవం. అయితే ఇప్పుడున్న 23 జిల్లాలకు హైదరాబాద్ రాజధాని కాబట్టి ఎక్సైజ్, వాణిజ్య పన్నులు ఇక్కడే జమ అవుతున్నాయి. అదే తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఇక్కడ 10 జిల్లాల పన్నులు మాత్రమే జమ అవుతాయి కాబట్టి ఈ ఆదాయం భారీగా తగ్గుతుంది. కొత్తగా ఏర్పడే సీమాంధ్ర రాజధానికి 13 జిల్లాల పన్ను వసూళ్లు జమ అవుతాయి కాబట్టి ఆ రాజధాని ఆదాయం గణనీయంగా ఉంటుంది
ఈ విషయాలు నాగభైరవ జయప్రకాశ్ నారాయణకు తెలియక కాదు. ఆయన కూడా చంద్రబాబు, జగన్ బాబు లాగానే ఆంధ్ర బాబు కాబట్టి తెలంగాణ రాకుండా అడ్డుకోవాలనే దురాలోచనతోనే ఈ అసంబద్ధ వాదనలు చేస్తున్నాడు.
పోనీ ఇంతచేసి లోక్ సత్తా పార్టీ సీమాంధ్రలో ఏమైనా బావుకుంటుందా అంటే అదీ లేదు. ఆ పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్నది తెలంగాణలోనే. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా తెలంగాణ ప్రాంతంలోనే గెలిచిండు. అయినా కూడా తాము సీమాంధ్ర ప్రాంత పక్షపాతులమని చాటుకోవడానికే నాగభైరవ వంటి వారి తాపత్రయం.
నిన్న ఆయన యాత్రకు సమైక్యవాదులు అడుగడుగునా ఆటంకం కల్పించారు. ఆయన సభ పెట్టుకున్న సెయింట్ జోసెఫ్ కాలేజీ యాజమాన్యం చివరి నిముషంలో ఆ సభకు అనుమతి రద్దుచేసింది. లోక్ సత్తా తెలుగు తేజం ఫ్లెక్సీలను కొంతమంది సమైక్యవాదులు కాల్చేశారు. ఒక లోక్ సత్తా నాయకుడిపై చేయిచేసుకున్నారు. యాత్రకు లోక్ సత్తా వారు ఏర్పాటు చేసుకున్న బస్సు టైర్లలో గాలితీసేశారు.
ఇదంతా చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది ఏమిటంటే నాగభైరవ జయప్రకాశ్ నారాయణ కూడా చంద్రబాబు లాగానే రెంటికీచెడ్డ రేవడి కాబోతున్నాడని.
—
Related Articles:
– శకునం చెప్పే జేపీ కుడితిలో పడ్డాడు
– లోక్ సత్తా అనే ఒక ప్రజాస్వామ్య సత్తురేకు
– We Are Not Amused Lok Satta!