mt_logo

మార్బుల్‌@ఇల్లెందు

ఇల్లు చిన్నదైనా మార్బుల్ అందాలతో అలంకరిస్తే ఆ ఠీవీయే వేరు! భారీ పెట్టుబడితో ఇల్లుకట్టినా మార్బుల్ రాళ్లు లేకుంటే వృథా! ఇంటి అందానికి వన్నెతేవడంలో మార్బుల్ రాళ్ల తర్వాతే ఏవైనా! ఇంతటి ఘనచరిత్ర ఉన్న మార్బుల్ రాళ్లు మనకు అందుబాటులో ఎక్కుడున్నాయని ప్రశ్నిస్తే.. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్‌క్వారీ అని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. సమైక్యపాలనలో తెలంగాణ అభివృద్ధి చెందే ప్రతి అవకాశాన్ని తొక్కిపెట్టారనే కుట్రలకు అతిపెద్ద ఉదాహరణే..ఇల్లెందు మార్బుల్ నిక్షేపాలు. ఖమ్మం జిల్లా ఖనిజాల ఖిల్లా! బొగ్గు, ఐరన్‌ఓర్, డోలమైట్, లైమ్‌స్టోన్,గ్రానైట్, బైరటీస్, క్రోమైట్ ఖనిజాలకు పెట్టింది పేరు! ఖనిజాలకు దీటుగా ఇల్లెందు ఏజెన్సీలో మార్బుల్ నిక్షేపాలు కోకొల్లలు.

-దేశంలో నాణ్యమైన రాళ్లకు ఇదే చిరునామా
-సమైక్యపాలనలో మరుగునపడిన పరిశ్రమ
-నిజాంకాలంలో 1935లోనే మైనింగ్ మొదలు
-గిరిజన సోసైటీలకు లీజుకిస్తే సర్కారుకు ఆదాయం
-50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
ఇల్లెందు, జాస్తుపల్లి, దండగుండాల, కెప్టెన్ బంజార, పుబల్లి, మొండితోగు ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో మార్బుల్ క్వారీలు విస్తరించి ఉన్నాయి. దేశవ్యాప్తంగా మార్బుల్ రంగానికి నడకలు నేర్పింది ఇల్లెందు మార్బులే. రాజస్థాన్‌లోని జకరా మార్బుల్ కంటే పదిరెట్లు నాణ్యమైన మార్బుల్ ఇక్కడే లభ్యమవుతున్నది. నలుపు, తెలుపు, పసుపుపచ్చ, నలుపులో తెలుపు చారికలు కలిగిన రాళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.

మొండితోగు అడవుల్లో మైనింగ్
ఇల్లెందు ఏజెన్సీలోని నాణమైన మార్బుల్ దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఇతర దేశాలకు ఎగుమతైంది. ఇటలీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత మార్బుల్ కంపెనీ కెర్రారా.. ఇల్లెందులో 1935లోనే మైనింగ్ చేపట్టింది. ఆనాడే నిజాం ప్రభుత్వం మైనింగ్ బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించింది. ఇల్లెందుకు పదికిలోమీటర్ల దూరంలోని మొండితోగు అడవుల్లో మైనింగ్ చేపట్టారు. ఆనాడు శంకుస్థాపన చేసిన శిలాఫలకం ఇప్పటికీ పదిలంగా ఉన్నది. మైనింగ్ ఆనవాళ్లు, మార్బుల్ రాళ్లు సైతం ఆ క్వారీలో ఉన్నాయి.

క్వారీల్లో రాళ్లను వెలికి తీసే వైర్సా టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ మొండితోగు గుట్టలపై ఇటాలియన్ కంపెనీ ఆనాడే వినియోగించి ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. రెండు గుట్టల మధ్య చెక్‌డ్యామ్ నిర్మించి నీటిని నిల్వచేసి డీజిల్ ఇంజిన్ల ద్వారా గుట్టపైకి ఎక్కించి స్లాబ్‌కటింగ్ చేసిన ఆనవాళ్లున్నాయి. మైనింగ్ నిపుణులు నివాసం ఉండేందుకు నిర్మించిన క్వార్టర్ల పునాదులు సైతం ఉన్నాయి. అప్పట్లో దశాబ్దంపాటు మైనింగ్ చేపట్టి, రెండో ప్రపంచయుద్ధకాలం ముగింపులో నిలిపివేసినట్లు సమాచారం. 1980వ దశకంలోనూ ఇక్కడ తవ్వకాలపై కదలిక వచ్చినప్పటికీ కేంద్రం 1/70 చట్టాన్ని తేవడంతో అటవీప్రాంతం చట్టం పరిధిలోకి వెళ్లి నిలిచిపోయింది.

ఇల్లెందు మార్బుల్ నాణ్యతపై బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. ప్రపంచంలోనే ఇల్లెందు మార్బుల్ అత్యున్నత్తమైనదిగా జర్నల్స్‌లో పొందుపరిచారు. 1940 మార్చి 12న ఇల్లెందు మార్బుల్‌పై శాస్త్రవేత్త ఎన్ జయరామన్ కూడా నివేదిక రూపొందించినట్లు సమాచారం.

గిరిజన సొసైటీలను ప్రోత్సహిస్తే మేలు
ఇల్లెందు ఏజెన్సీలో మైనింగ్ చేపడితే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు అనేక మార్బుల్ పరిశ్రమలకు ఖమ్మం జిల్లా వేదిక కానుంది. కనీసం 50 వేల మందికి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ప్రస్తుతం మార్బుల్ ఎక్కువగా రాజస్థాన్ నుంచి దిగుమతి అవుతున్నది. అక్కడి నుంచి రాష్ట్రానికి రావడానికి ఒక్క ఫీటుకు రూ.20 ఖర్చు అవుతున్నది. ఇక్కడే ఉత్పత్తి మొదలైతే ధరలు తగ్గే అవకాశం ఉన్నది. ఇల్లెందు ఏజెన్సీలో నిక్షేపాలు ఉన్నందున గిరిజన సొసైటీలకే మైనింగ్ లీజులు ఇచ్చే అవకాశం ఉన్నది. ప్రభుత్వం, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తే, నిర్ణయించిన ధరకు ప్రైవేటు పరిశ్రమలు కొనుగోలు చేస్తాయి.

హర్షద్‌మెహతా ఇంటికి సప్లయ్ చేశా
– యలమద్ది శ్రీనివాసరావు, ప్రముఖ గ్రానైట్ వ్యాపారి

ముంబైలోని ప్రముఖ స్టాక్‌బ్రోకర్ హర్షద్ మెహతా ఇంటికి వినియోగించింది ఇల్లెందు మార్బులే. మధ్యవర్తి ద్వారా నేరుగా ఇక్కడి నుంచి మార్బుల్‌ను నేనే పంపా. మైసూర్ ప్యాలెస్‌కు కూడా ఇల్లెందు మార్బుల్‌ని వాడారని మా పూర్వీకులు చెప్పారు. శాసనసభ కార్యదర్శిగా పనిచేసిన సదానందరెడ్డి ఇంటికి ఇల్లెందు మార్బుల్‌నే వాడారు. సుమారు ఐదేళ్లపాటు మైనింగ్‌చేశాం. సుప్రీంకోర్టు తీర్పుతో మా లీజులు రద్దయ్యాయి. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకొని ఇల్లెందు మార్బుల్ వెలికితీతకు చర్యలు తీసుకోవాలి. గిరిజన సొసైటీలను ప్రోత్సహించి వారికే మైనింగ్ అప్పగించాలి. అక్కడ మైనింగ్ నిర్వహిస్తే కొనుగోలుకు పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన మార్బుల్ ఇక్కడ లభ్యమవుతోంది.

స్టోన్‌సిటీగా ఖమ్మం అవతరిస్తుంది
– ఉప్పల వెంకటరమణ,
గ్రానైట్ జేఏసీ నేత, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత

ఇల్లెందు ఏజెన్సీలో మార్బుల్ మైనింగ్ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే మంత్రి ఏజెన్సీలో పర్యటిస్తారు. ఏజెన్సీలో వేలాది ఎకరాల్లో మార్బుల్ నిక్షేపాలున్నాయి. గిరిజన సొసైటీల ద్వారా మైనింగ్ చేపట్టి నిక్షేపాలు వెలికితీస్తే భారీ పరిశ్రమలు వెలిసే అవకాశం ఉన్నది. స్థానికులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి అదాయం వస్తుంది. ఇల్లెందు, ఖమ్మం మధ్య సుమారు 40 కిమీ పరిధిలో మార్బుల్ పరిశ్రమలు విస్తరిస్తాయి. చైనాలోని స్టోన్‌సిటీ మాదిరిగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లా స్టోన్‌సిటీగా అవతరించడం ఖాయం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *