By: చే
అరవైయేండ్ల కల సాకారమైన వేళ.. కొత్త ఆశలతో పులకించిపోతున్న తెలంగాణ నేల, సమస్త రంగాల ఆధిపత్య పీడనల నుంచి బయటికి వచ్చింది. అన్ని రంగాల్లో అన్ని శాఖలలో తమతమ వాటాలను స్వతంత్ర్యంగా నిర్ణయించుకుంటున్న తెలంగాణ సమాజం నేడు ఒక రంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది. ఆ రంగమే సినిమా రంగం. తెలంగాణ ప్రాంతంలో అందులో ముఖ్యంగా హైదరాబాద్‌లో తమ ఆస్తులను, పాపులారిటీని పెంచుకున్నారు. నేడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఇన్ని రోజులు ఆధిపత్యవాదుల చేతుల్లో నలిగిపోయిన తెలంగాణ సమాజం తన ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వారి కబంధహస్తాల నుంచి స్వేచ్ఛా పుంతలు తొక్కుతూ ముందుకు పోతున్నది.
ఏ రంగం నుంచి అయితే ఎక్కువ నష్టం తెలంగాణకు జరిగిందో, ఆ రంగాన్ని అది మనకు సంబంధం లేని దానిగా, దాన్ని మళ్ళీ ఆంధ్రా సినీ ఆధిపత్య వాదులకే వదిలివేస్తున్నట్లు కనబడుతున్నది. ఎక్కడైతే సంస్కృతి ధ్వంసం కాబడ్డదో, అన్యాయం జరిగిందో అక్కడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. కానీ ఈ సినీరంగ ప్రముఖులు ఎన్నడూ తెలంగాణ ప్రజల భావాలకు గానీ, ఉద్యమాలకు కానీ సహకరించలేదు.
1921 ప్రాంతంలోనే హైదరాబాద్, మద్రాసులో సినిమా పరిశ్రమ మొదలైంది. తెలుగు సినిమా కేంద్రంగా మద్రాసు నుంచి మొదలైతే హైదరాబాదు కేంద్రంగా తెలంగాణ సినిమా మొదలైంది. కానీ తెలంగాణ సినిమా రంగం అసలు ప్రస్తావనే లేకుండా ఈ ఆంధ్రా సినిమా వాళ్లు దానిని మరుగున పడేశారు. ఈసారి ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన ప్రముఖ హీరోలు, నిర్మాతలు, దర్శకులు మోడీని కలిసి మద్దతు ప్రకటించారు. ఏకంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటీ చేయకుండానే ఆంధ్ర ఆధిపత్యవాదులకు మద్దతు ప్రకటించి ప్రచారం చేశాడు. అదే సినిమా రంగం నుంచి మన ప్రాంత పార్టీలకు ప్రచారం చేయడానికి ఒక్క హీరో కూడా తెలుగు సినిమా రంగం నుంచి లేడు అంటే ఎంత వివక్ష సినీ రంగంలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి అన్యాయం జరుగుతున్న రంగం గురించి ఒక్కరు మాట్లాడకపోవటం విచారకరం. అడదపాదడపా మాట్లాడిన కొంత మంది తరువాతి కాలంలో మాట్లాడడం మానేశారు. ఎందుకో గాని ఆంధ్ర సినిమా బినామీలుగా కొనసాగుతున్న తెలంగాణ సినిమా వారసులుగా చెప్పుకుంటున్న కొంతమంది వారు చూపే ప్రలోభాలకు లొంగి తెలంగాణ ప్రత్యేకంగా సినిమారంగంగా మారకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా చోటా, మోటా హీరోలైన శివాజీ, సురేష్ లాంటి వారు తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ ఏర్పాటును బాహాటంగా వీడియో రూపంలో పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేశారు.
రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడు తెలంగాణ సీఎం మీద అనవసరమైన కామెంట్లు పెట్టి అవమానపరుస్తున్నాడు. ఈ రోజు ఆంధ్ర సినిమా రంగం మరొక కొత్త కుట్రలకు దారి వేస్తున్నది.ఎన్టీఆర్ తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతో తెలంగాణ ప్రాంత అస్థిత్వం లేకుండా చేశాడో, మళ్ళీ అదే తెలుగు అనే పదాన్ని చేర్చి వారి సినిమారంగానికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అని నామకరణం చేసుకున్నారు. అంటే ఈ విధంగా మళ్ళీ తెలంగాణ ప్రాంత నైజాం ఏరియా కలెక్షన్లకు అలవాటు పడ్డ ఆంధ్ర సినీ పెట్టుబడిదారులు తెలంగాణ సినిమా అనే స్పృహలోకి రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌గా, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోషియేషన్‌ను తెలుగు చలనచిత్ర డైరెక్టర్స్ అసోషియేషన్ గా మార్చుకుంటున్నారు.
తెలంగాణ సినిమాను బతికించిన సినీ మహాత్ములుగా పైడి జయరాజ్, శ్యామ్ బెనగల్, బి. నర్సింగరావు లాంటి వాళ్ళ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న తెలంగాణ సినీ యువత నేడు ఉద్యమాలకు ఊపిరిపోసిన తెలంగాణ చైతన్య పతకాన్ని తెలంగాణ సినిమాను నిర్మించడానికి పూనుకున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి. ఇన్ని రోజులు మరుగున పడ్డ తెలంగాణ సినిమా ఇప్పటికైనా కొత్త రాష్ట్రంలోనైనా ఆంధ్ర ఆధిపత్య సినీ మాయాజాలం నుంచి బయటకు రావాలి. తెలంగాణ కళలను, సంస్కృతిని కాపాడే, తెలంగాణ సినిమాను నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రాంతీయ సినిమాలు అంటే చిన్న సినిమా అని, వాటి ద్వారా మంచి సినిమాలు రావనే భావనను కలిగించిన ఆంధ్ర సినీ మాయజగత్తు నుంచి బయటికి వచ్చి ఒక బెంగాల్ , భోజ్‌పురి, మలయాళ , మరాఠా సినిమా లాగా తెలంగాణ ప్రాంతంలో మానవీయ విలువలతో కూడిన సినిమాలను నిర్మించి తెలంగాణ సినిమాను బతికించాలి.
తెలంగాణ ప్రాంత కళాకారులకు, తెలంగాణ సినిమా పరిశ్రమ అభివద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాలు అందించాలి. తెలంగాణ ప్రాంత వారసత్వాన్ని, తెలంగాణ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలు తెలంగాణ ప్రాంతంలో ఆవిష్కరించాలి. ఆంధ్రా ప్రాంత సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం టాక్స్‌లు వసూలు చేసి తెలంగాణ సినిమా పరిశ్రమాభివృద్ధికి కృషి చేయాలి.
అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో డెబ్బైశాతం (అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాలను కాకుండా తెలంగాణ పది జిల్లాల్లో) షూటింగ్ చేసిన సినిమాలకు పన్నురాయితీ కల్పించే విధంగా అవకాశం కల్పించాలి. తెలంగాణ సినిమాలో తెలంగాణ భాషను వాడే విధంగా చూడాలి. తెలంగాణ సినిమాలకు థియేటర్ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో చిన్న సినిమాలను బతికించి వాటికి ప్రోత్సహాకాలు ఇవ్వాలి. అప్పుడే నిజమైన తెలంగాణ సినిమా నిర్మాణం జరిగి తెలంగాణ ప్రాంత కళా వారసత్వ నైపుణ్యం ఎల్లకాలం నిలుస్తుంది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..