mt_logo

మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి

By: కట్టా శేఖర్‌రెడ్డి

కేసీఆర్ ప్రమోటీ నాయకుడు కాదు. అనేక పరీక్షల్లో నిగ్గుదేలిన నాయకుడు. తనను తాను సానపట్టుకుని రాటు దేలిన నాయకుడు. ఆయనకు పద్నాలుగేళ్ల ఉద్యమం అందించిన దార్శనికత ఉంది. పట్టిన పట్టువదలడన్న పేరు ఉంది. అనుకుంటే సాధించి తీరాలన్న పంతం ఉంది. పని రాక్షసుడు.

ఉదయం ఎనిమిదిన్నర గంటలు. కళ్లద్దాలు పెట్టుకుని బనీను ధరించిన పెద్దాయన ఓ కట్ట పత్రికలు ముందేసుకుని చదువుతున్నారు. కొన్ని పరీక్షగా, కొన్ని పైపైన చూస్తున్నారు. ఆయన అలా ఓ గంటకు పైగా ఆ పత్రికల్లో మునిగిపోతారు. తర్వాత రెడీ కావడం వచ్చిన వారిని కలవడం, సచివాలయానికి వెళ్లడం, అక్కడ గంటలు గంటలు సమీక్షలు. మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ సమీక్షలు. ఒక్కోసారి ఐదారు గంటలు ఏకబిగిన సమీక్షల్లో కూర్చుంటున్నారు. ఒక్కసారి సమీక్షలో కూర్చుంటే మధ్యలో ఎవరినీ కలవడం లేదు. ముఖ్యమంత్రి మమ్మల్ని కలవడం లేదని కొందరు నొచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. అసెంబ్లీ నడుస్తున్న రోజుల్లోనూ అంతే. ఆయన దిన చర్య అంతే బిజీగా ఉంటున్నది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఏవో ఆంతరంగిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంత కష్టపడతారని, ఇలా పనిచేయగలరని మేము ఊహించలేదు. ఇంత సమర్థంగా అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కొంటారని అనుకోలేదు. మా అనుమానాలన్నీ పటా పంచలయ్యాయి’ అని ఒక సీనియర్ ఆంగ్ల జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున కేసీఆర్ ప్రసంగం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. తెలంగాణపైన ఆయనకున్న పట్టు, సమస్యలపై ఆయనకున్న స్పష్టత, ఏ జిల్లాలో ఏ మూల ఏ వాగు, ఏ రిజర్వాయరు, ఏ ప్రాజెక్టు ఉన్నదీ ఆయన వివరిస్తున్న తీరు అందరినీ ఆలోచింపజేసింది.

పద్నాలుగేళ్ల ఉద్యమకాలంలో సీమాంధ్ర ఆధిపత్యశక్తులు చేసిన ప్రచారం వల్ల కేసీఆర్‌పై అనేక అపోహలు, అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. బారు, దర్బారు అని మొదలు పెట్టి ఆయన ఆరోగ్యం పాడయిపోయింది ఇక ఉద్యమం ముందుపడదు అనేదాకా అనేక రకాల ప్రచారాలు సాగించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకుడిపై జరుగనంత దాడి కేసీఆర్‌పై జరిగింది. సీమాంధ్ర ఆధిపత్య శక్తులకు తెలంగాణ నేతలంటేనే చిన్నచూపు. వీళ్ల వల్ల ఏమవుతుందిలే అన్న చులకన భావన. అందుకే సమైక్య రాష్ట్రంలో ఏ తెలంగాణ నాయకుడూ ముఖ్యమంత్రిగా వరుసగా మూడేళ్లు పరిపాలించలేకపోయారు. పీవీ నరసింహారావును జై ఆంధ్ర ఉద్యమం పేరుతో పదిహేను మాసాలకే ఇంటికి పంపారు. చెన్నారెడ్డిని రెండున్నరేళ్లకే అవినీతి తాటాకులు కట్టి అధికారం నుంచి దించేశారు. టంగుటూరి అంజయ్యను కామెడీ ముఖ్యమంత్రిగా చిత్రీకరించి ఆయనను కూడా దించేసి భవనం వెంకట్రామ్‌ను తెచ్చారు. రెండవసారి 199లో కూడా చెన్నారెడ్డిని ఏడాది కాలానికే మత కల్లోలాలు సృష్టించి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేశారు. 1990 తర్వాత 24 సంవత్సరాలు తెలంగాణ అజ్ఞాతవాసంలోనే ఉంది. మనలను మనం పరిపాలించుకునే అవకాశమే రాలేదు. మర్రి చెట్టు నీడలో మరో చెట్టు బతకదు, ఎదగదు. సీమాంధ్ర ఆధిపత్యం అనే మర్రి చెట్టు తెలంగాణ నాయకత్వాన్ని ఎదగనీయలేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇప్పుడు మనకు అటువంటి బంగారు అవకాశాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలంగాణ ఆత్మ తెలిసిన మనిషి, తెలంగాణ గోస, యాస, బాస తెలిసిన మనిషి మన ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్రలో తొలిసారి మన రాష్ట్రం, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ఇది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సాధించిన అసాధారణ విజయం. కేసీఆర్ రానున్న ఐదేళ్లలో ఎటువంటి విజయాలు సాధిస్తారు, పాలనలో సఫలమవుతారా విఫలమవుతారా అన్నది తర్వాత సమీక్షించుకోవచ్చు. కానీ ఆయన ఇప్పుడు సాధించిన విజయాలు ఆయన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతాయి. సామాన్యులను అసామాన్యులుగా, అపరిచితులను సుపరిచితులుగా, తరతరాల పరాజిత తెలంగాణను విజయ తెలంగాణగా నిలబెట్టిన సందర్భం ఇది. ఎవరు శోభ, ఎవరు సునీత, ఎవరు సుమన్, ఎవరు వీరేశం, ఎవరు కిశోర్…… ఇలా చెబుతూ పోతే 60 మందికిపైనే లెక్కకు వస్తారు. అంతా తెలంగాణ పోరాటంలో ఉన్నవారే. కానీ గెలిచి శాసనసభలో ప్రవేశించగలిగిన సాధన సంపత్తులు ఉన్నవారు కాదు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ఎదిగివచ్చిన రాజకీయ చైతన్య కెరటాలు. తెలంగాణ సమాజానికి ఓ కొత్త తరం నాయకత్వాన్ని అందించిన ఘనత కేసీఆర్‌ది.

‘పద్నాలుగేళ్లు ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్, అనేక ఎదురు దెబ్బలు, అనేకానేక ఎత్తుపల్లాలను దాటి తెలంగాణవాదాన్ని గెలిపించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించలేరా?’ అని ఒక అధ్యాపకుడు వ్యాఖ్యానించారు. అతని మాటల్లో ధీమా ఉంది. ఇతర పార్టీల నాయకుల లాగా కేసీఆర్ ప్రమోటీ నాయకుడు కాదు. అనేక పరీక్షల్లో నిగ్గుదేలిన నాయకుడు. తనను తాను సానపట్టుకుని రాటు దేలిన నాయకుడు. ఆయనకు పద్నాలుగేళ్ల ఉద్యమం అందించిన దార్శనికత ఉంది. పట్టిన పట్టువదలడన్న పేరు ఉంది. అనుకుంటే సాధించి తీరాలన్న పంతం ఉంది. పని రాక్షసుడు. అందుకే ఆయన విజయం సాధించి తీరతాడని చాలా మంది నమ్ముతున్నారు. ‘వంద పనులు పెట్టుకోవద్దు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరా, ఉద్యోగాల భర్తీ….ఈ రంగాల్లో మనం ఎంత ప్రగతిని సాధిస్తామన్నదే ప్రధాన కొలమానం అవుతుంది. రుణాల మాఫీ, పెన్షన్లు, రెండు గదుల ఇళ్లు ఇవన్నీ తక్షణం పేరు తెచ్చిపెడతాయి. సాగునీరు, విద్యుత్ దీర్ఘకాలికంగా పేరు తెచ్చిపెడతాయి’ అని రిటైర్డ్ ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. ‘ప్రతి జిల్లాలో ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 40 నుంచి 50 చెరువులు నిండే అసంపూర్తి కాలువలు, ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. తక్షణం వాటిని పూర్తి చేసినా ఎంతో మార్పు వస్తుంది’ అని ఒక రిటైర్డు ఇంజనీరు అన్నారు. ‘కేసీఆర్ రైతు కష్టం తెలిసినవారు. స్వయంగా రైతు. ఆయన తెలంగాణ వ్యవసాయాన్ని ఒక మేలు మలుపు తిప్పుతారన్న నమ్మకం నాకు ఉంది’ అని నల్గొండ జిల్లా రైతు నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆకాంక్షలు ఇలా ఉంటే, తెలంగాణ ఓడిపోవాలని ఆశించే శక్తులు మరోవైపు కుట్రలు చేస్తూనే ఉన్నాయి.

‘తెలంగాణ ఓడిపోవావాలి. కేసీఆర్ విఫలమవ్వాలి. 2019 నాటికి తెలంగాణను తిరిగి చేజిక్కించుకోవాలి’- ఇది క్లుప్తంగా తెలంగాణ వ్యతిరేకుల ఎజెండా. మనం పడితే నవ్వడానికి, మనం ఏడిస్తే ఆనందించడానికి, మనం విఫలమయితే విజయోత్సవాలు జరుపుకోవడానికి ఒక మూక ఎప్పుడూ ఇంటా బయటా కాచుకుని కూర్చుంది. తెలంగాణ ఏర్పడడం ఏమిటి? దానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఏమిటి? చాలా మందికి ఇది జీర్ణం కావడం లేదు. సీమాంధ్ర మేధావులు, మీడియా, నాయకత్వం ఇప్పటికీ కేసీఆర్‌ను, తెలంగాణ నాయకత్వాన్ని ఒకనాటి చులకన భావనతోనే, ఆధిపత్యధోరణితోనే విశ్లేషించడానికి, వ్యాఖ్యానించడానికి, విమర్శించడానికి తెగిస్తున్నది. చంద్రబాబునాయుడుకు, సీమాంధ్ర నాయకత్వానికి ఇచ్చిన కూలింగ్ పీరియడ్‌ను కూడా తెలంగాణ నాయకత్వానికి ఇవ్వడానికి సుముఖంగా లేదు. తెలంగాణలోని వారి ఏజెంట్లు నాయకుడిని మించిన నాయకభక్తిని ప్రదర్శిస్తున్నారు. ‘స్వరాష్ట్రంలో ఇంకా సీమాంధ్ర నాయకత్వానికి ‘ఎస్ బాస్‌లు’ చెప్పే స్వయంప్రకాశం లేని నాయకులు ఇంకా మనకు అవసరమా?’ ఒక మిత్రుడు ఆవేశంగా ప్రశ్నించారు. కొంతకాలం తప్పదు. వారిని కూడా ఇక్కడి ప్రజలే ఎన్నుకున్నారు. వారి అవసరం తెలంగాణకు లేదని రుజువు చేయవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపైన, టీఆర్ఎస్ నాయకత్వంపైన ఉంది.

తెలంగాణ నిలుస్తుంది. తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణ చరిత్రను పునరావృతం కానివ్వదు. కొత్త చరిత్రను సృష్టిస్తుంది. అది కేసీఆర్ చరిత్ర కూడా కావాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *