mt_logo

హైదరాబాద్ నగరాన్ని ఐటీ రాజధానిగా మారుస్తాం..

బెంగళూరులో తెలంగాణ ఐటీ శాఖ బుధవారం నిర్వహించిన ఐటీ రోడ్ షో కార్యక్రమంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలతో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలోని అత్యుత్తమ విద్య, మౌలిక సదుపాయాలతో బహుళజాతి కంపెనీలకు, ఐటీ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులు హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయని, ఐటీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేందుకు ఇది దోహదపడుతుందని, నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశోధనలకు ముందుకు రావాలని ఐటీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హోటల్ మారియట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులు భారీగా హాజరయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, హైదరాబాద్ నగరంలోని సౌకర్యాలను కేటీఆర్ వివరించారు.

రూ. లక్ష కోట్ల ఐటీ ఎగుమతులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, ఐటీలో ప్రస్తుతం ఉన్న 3.25 లక్షల ఉద్యోగుల సంఖ్యను పది లక్షలకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, డెల్, మోటరోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిమెన్స్, జేపీ మోర్గాన్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, ఫేస్ బుక్ తదితర అంతర్జాతీయ కంపెనీలు అత్యధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని, దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, విప్రో, కాగ్నిజెంట్ తదితర కంపెనీలు సైతం హైదరాబాద్ నుండి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. అత్యుత్తమ విద్య, పరిశోధన అవకాశాల కోసం ఉస్మానియా, జేఎన్టీయూ, ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్ బీ, నల్సార్, డీఆర్డీవో తదితర సంస్థలు ఉన్నాయని, వీటిద్వారా పరిశ్రమలకు కావాల్సిన విధంగా విద్యార్థులు సిద్ధమవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడికైనా రెండు గంటల్లో వెళ్ళేలా వీలుండటం హైదరాబాద్ కున్న ప్రత్యేకతని, నగరంలోని మౌలిక వసతులపై ఖర్చు ఇతర నగరాలతో పోలిస్తే చాలా తక్కువని, రాబోయే రోజుల్లో ఈ-లెర్నింగ్, ఈ-హెల్త్ కేర్ వంటి కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు చేపడతామని చెప్పారు. తెలంగాణా ప్రభుత్వం ఐటీ పరిశ్రమ అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్ గా గుర్తించిందని, ఐటీ ఉత్పత్తులను పెంచేందుకు రూ. 2,19,440 కోట్లతో 202 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలోనే 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన టీ-హబ్ ఇంక్యుబేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *