ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం యాదగిరిగుట్టకు చేరుకొని ఆలయ అభివృద్ధిపై సమీక్ష జరిపారు. అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఉగాదికి సిద్ధం చేయాలని, ఉగాది నుండి పనులు ప్రారంభించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, యాదగిరిగుట్టకు వెళ్లే దారిలోకి ప్రవేశించగానే లక్ష్మీనరసింహుడి స్తోత్రాలు వినిపించాలని, గుట్టకు వెళ్లే నాలుగు మార్గాలలోనూ దారి పొడవునా వేదమంత్రోచ్చారణలతో ఆ ప్రాంతం మారుమోగిపోవాలని అన్నారు. ఎటు చూసినా భక్తి భావాన్ని పెంపొందించేలా, నైతిక విలువలకు ఊతమిచ్చేలా, పర్యావరణాన్ని కాపాడేలా బోధనలు కనిపించాలని సూచించారు. అంతేకాకుండా గుట్ట పైకి వెళ్లే నాలుగుమార్గాల్లోనూ సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని, ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలతో పాటు నిత్యజీవన ఒత్తిడి నుండి విముక్తి పొందే వాతావరణం గుట్ట పరిసరాల్లో కూడా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
ప్రధాన ఆలయం చుట్టూ మాడవీధులు నిర్మించాలని, చాలా దూరం నుండి చూసినా కూడా గోపురం, ఆలయం చక్కగా కనిపించే విధంగా నిర్మాణం ఉండాలని, గుట్ట పైభాగంలోనే ప్రధాన ఆలయంతో పాటు కళ్యాణ మండపం, యాగశాల, వ్రతశాల మొదలైనవి నిర్మించాలని, గుట్టపైన కూడా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భక్తులకు వసతిగృహాలు, మంటపాలు, వంటశాలలు నిర్మించాలని, ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు జరగాలని, ప్రస్తుతం ఉన్న వాటిలో మార్పులు చేయాలని సూచించారు. త్వరలో త్రిదండి శ్రీ చిన్న జీయర్ స్వామిని యాదగిరిగుట్టకు తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఆయన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు.
రాయగిరి నుండి యాదగిరిగుట్ట వరకు నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని, మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా యాదగిరి, రాయగిరి గుట్టలను పునరుద్ధరించి వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తాను ఎప్పటికప్పుడు యాదగిరిగుట్టకు వస్తూనే ఉంటానని, పనులను పర్యవేక్షిస్తానని, ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి కంపెనీలు కూడా ఆలయ అభివృద్ధిలో పాలుపంచుకునే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ ఈవో గీత, యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ లు, ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొన్నారు.