కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై దేశంలో ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతె వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
“మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్తిపోతున్నారు. మేకిన్ ఇండియా అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందనట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వారు.. విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి, మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. దెబ్బ తింటాం. ఒక్కసారి ఇబ్బంది వస్తే చాలా ఘోరంగా వంద సంవత్సరాలు వెనక్కి పోతాం” అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా. మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అని కేసీఆర్ అన్నారు.