తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అమలు చేయడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక రథ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హరితహారం పథకంలో అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లు పాల్గొని విజయవంతం చేయాలని, ఒకట్రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి ఆడియోను రిలీజ్ చేస్తామని తెలిపారు.
తెలుగు ప్రజలను గందరగోళ పరిస్థితుల్లో పడేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఏపీ ప్రభుత్వం ఏంటో అందరికీ తెలిసిపోయిందని రసమయి మండిపడ్డారు. తెలంగాణ న్యూస్ ఛానల్ టీ న్యూస్ కు నోటీసు ఇవ్వడం ద్వారానే అంతా కుట్ర అని తెలిసిపోయిందని, తప్పు చేసినప్పడు వివరించే ప్రయత్నం చేయాలే తప్ప కప్పిపుచ్చుకోవడం సరికాదని అన్నారు. గతంలో చంద్రబాబు తెలంగాణ ఉద్యమాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేశాడని, తెలంగాణ ఛానల్ వెనుక కోట్లాది మంది ప్రజలు ఉన్నారని రసమయి స్పష్టం చేశారు.