mt_logo

చంద్రబాబు బరితెగింపు!!!

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు బరితెగించాడు! అర్ధరాత్రి టీన్యూస్ కార్యాలయంలోకి ఆంధ్రా పోలీసులను పంపడం ద్వారా తనలో ఉన్న విలన్ ను మరోసారి బయటపెట్టుకున్నాడు. ఓటుకు నోటు కేసులో అన్ని దారులు మూసుకుపోయి బయటపడే మార్గం లేకపోవడం, ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని తేలిపోవడం, ఆడియో టేపులు అతికించినవన్న వాదనలు తేలిపోవడం, సెక్షన్-8 సాధ్యం కాదని కేంద్రం మొట్టికాయలు వేయడం, గవర్నర్ పై చేసిన విమర్శలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించాలని కుట్రకు తెరలేపాడు. ఒకప్పుడు సీఎం పదవి కోసం సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ నగరంలో మారణహోమం సృష్టించారు. ఇప్పుడు చంద్రబాబు తనను తాను రక్షించుకోవడానికి ఎన్ని దారుణాలకైనా ఒడిగడ్తున్నాడు. అన్ని ఎత్తుగడలు విఫలం కావడంతో నేరుగా తెలంగాణపైనే ఎదురుదాడికి దిగాడు. టీ న్యూస్ కు నోటీసులు జారీ చేశాడు.

తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తున్న టీ న్యూస్ కార్యాలయంలో అర్ధరాత్రి ఏపీ సీఐడీ అధికారులు వచ్చి ఓటుకు నోటు కేసుకు సంబంధించి వీడియో, ఆడియో టేపులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఏపీ పోలీసులు ఎక్కడా నిబంధనలు పాటించలేదు. ఏ రాష్ట్ర పోలీసులైనా మరో రాష్ట్రంలో ఎవరికైనా నోటీసులు ఇస్తే మొదట స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి వారి సహకారంతోనే ముందుకు పోవాల్సి ఉంటుంది. కానీ ఏపీ పోలీసులు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు, స్టీఫెన్ సన్ మధ్య జరిగిన సంభాషణ వల్ల ఏపీలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని, అందువల్లనే కేబుల్ యాక్ట్ చట్టం కింద నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొంటూ అర్ధరాత్రి టీ న్యూస్ కార్యాలయంలోకి వచ్చి టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

అర్ధరాత్రి నోటీస్ లు ఇవ్వడంపట్ల టీ న్యూస్ సీరియస్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీకి, ప్రెస్ కౌన్సిల్ కు, సమాచార, ప్రసార భారతి శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని తేల్చిచెప్పింది. నోటీసుల్లో కనీసం ఎవరు ఫిర్యాదు చేశారు? దీనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? అన్న వివరాలు ఏవీ లేవు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించడమేనని తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *