ప్రతి పేదవాడికీ ఆహార భద్రత కార్డు ఇవ్వడం తప్పా? అని, కొత్త కార్డులు ఇస్తే నష్టమేంటని? ప్రతిపక్షాలను భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమది పేదల ప్రభుత్వం అని, ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. రూ. 1000 పెన్షన్ ఇవ్వడం మీకు ఇష్టం లేదా? అని విమర్శించారు.
సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని, ప్రతిపక్షాలు ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు నమ్మరన్నారు. పెన్షన్లు, అంత్యోదయ కార్డులు ఎక్కువ మందికి ఇస్తున్నామని చెప్పారు. ఏ ఒక్క పేదవాడూ ఆహార భద్రత కార్డు లేకుండా ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, స్పష్టమైన నిబంధనలతోనే సర్వే చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఆహార భద్రత కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని హరీష్ రావు చెప్పారు.