ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం సాయంత్రం వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, సాకరాసికుంట, గిరిప్రసాద్ నగర్ మురికివాడల్లో పర్యటించారు. మురికివాడల్లో తిరిగే సమయంలో అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి మీ సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటానని భరోసా ఇచ్చారు. పలువురు పేదల ఇళ్ళలోకి వెళ్ళిన సీఎం పించన్ వచ్చిందా? పిల్లలు ఏం చేస్తున్నారు? అని వారి యోగక్షేమాలు అడుగుతూ ‘నేను పాత ముఖ్యమంత్రుల్లాంటి వాడిని కాదని, మాట తప్పని ముఖ్యమంత్రిని’ అని చెప్పారు.
మురికివాడల్లో పేదలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ, తెల్లారే సరికల్లా అధికారులంతా మీ గడప ముందట ఉంటారని, మీ సమస్యలు తీరుస్తారని అన్నారు. మురికివాడల్లో నివసిస్తున్న వారందరికీ జీ ప్లస్ 1 గృహాలను నిర్మించి ఇస్తామని, 400 నుండి 460 చదరపు అడుగుల స్థలంలో డబుల్ బెడ్ రూమ్, హాల్, కిచెన్ ను నిర్మిస్తామని, ఒక ఇంటికి రూ. 3.75 లక్షల ఖర్చైనా భరిస్తామని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రుల్లా మాటలు చెప్పడం కాదని, చేతల్లో చూపిస్తానని, పది రోజుల్లో కాలనీ వాసులందరికీ జీప్లస్ 1 ఇళ్ళకు శంకుస్థాపన చేస్తానని, నాలుగునెలల్లో స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఖర్చులు తీసుకోకుండా పేదలకు అప్పగిస్తామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, కమ్యూనిటీ హాల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం చేసి పేదల బస్తీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.
అక్కడున్న పేదలలో చాలామందికి పించన్లు రాలేదని తెలిసి ఇది చాలా బాధాకరమని, మురికివాడల ప్రజలంతా ఇళ్ళ దగ్గరే ఉండాలని, అధికారులే మీ ఇళ్ళకు వస్తారని, వారికి సహకరించి అన్ని వివరాలు అందజేయాలని సూచించారు. అర్హులందరినీ గుర్తించి అక్కడికక్కడే పించన్లు, ఆహారభద్రత కార్డులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయమే జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, ఇతర ఉన్నతాధికారులంతా మురికివాడలకు వెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఇక్కడి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఇక్కడే ఉంటానని, అవసరమైతే శనివారం సాయంత్రం వరకు ఇక్కడే ఉండి పరిష్కరించి పోతానని సీఎం చెప్పగానే ప్రజలంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. సీఎం అంతటివాడు మా దగ్గరికి వస్తాడని మేం కలలో కూడా అనుకోలేదని, మమ్మల్ని ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని, తండ్రి లెక్క మంచి చెడ్డలు అడిగారని, దేవుడొచ్చి వెళ్ళినట్లయిందని అక్కడి పేదలు సంతోషం వ్యక్తం చేశారు.