మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారుల కుటుంబాలకు శుక్రవారం మెదక్ జిల్లా తూఫ్రాన్ లో భారీ నీటిపారుదల శాఖామంత్రి టీ హరీష్ రావు ఒక్కొక్కరికి లక్ష చొప్పున 18 మందికి చెక్కులు పంపిణీ చేశారు. మృతుల కుటుంబాలకు గతంలోనే రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇచ్చామని, గాయపడిన కుటుంబాలకు ఎన్నికల కోడ్ మూలంగా ఆలస్యమైందని పేర్కొన్నారు.
చిన్నారుల భవిష్యత్ కోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని, వారు కోరుకున్న పాఠశాల లేదా మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చేర్పించి మంచి చదువులు చదివిస్తామని చెప్పారు. ఆరోగ్యపరంగా భవిష్యత్ లో ఉపయోగపడే విధంగా హెల్త్ కార్డులు అందించే విషయమై సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే చిన్నారులను తాను బాలాజీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిపించి వెంటనే సికింద్రాబాద్ లోని యశోదా దవాఖానకు తరలించామని, సకాలంలో తరలించడం వల్లే 18 మంది పిల్లల ప్రాణాలు రక్షించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.