mt_logo

పాఠ్య పుస్తకాల్లో మన తెలంగాణ

భవిష్యత్ తరాలకు మనం చేసిన పోరాటం, మన మహత్తర సంస్కృతి, చరిత్ర, వైతాళికులను పరిచయం చేసే ప్రక్రియ

సుదీర్ఘ పోరాటం, అసమాన త్యాగాల తరువాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2 నాడు ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలోని తొలి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి పాఠ్య పుస్తకాలను మార్చడం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషకు, చరిత్ర, సంస్కృతికి తీవ్ర వివక్ష ఎదురైంది. మరీ ముఖ్యంగా ఇది పాఠ్య పుస్తకాల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన భవిష్యత్ తరాలు చదివే పాఠ్య పుస్తకాలను సమూలంగా మార్చివేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, మన భాష, సంస్కృతి, చరిత్రకు సముచిత ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఒకటో తరగతి మొదలుకొని డిగ్రీ స్థాయి వరకూ ఉన్న పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేశారు. చివరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే పోటీ పరీక్షల సిలబస్ కూడా తెలంగాణ ఏర్పాటు చరిత్రను జోడిస్తూ సమూలంగా మార్చివేశారు.

ఈ వ్యాసంలో స్కూలు పుస్తకాల్లో తెలంగాణ సంబంధిత పాఠాల వివరాలు పొందుపరిచాను…

ఒకటో తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న కొన్ని పాఠాలు: మూకుడు, గీతల అంగి, మైదాకు, కొంగ సోపతి.. పాఠాల పేర్లలోనే తెలంగాణతనం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉమ్మడి రాష్ట్రపు పుస్తకాల్లో కనిపించని తెలంగాణ భాషను తొలి తరగతి నుండే పిల్లలకు పరిచయం చేసే ప్రయత్నం ఇది.

రెండవ తరగతి తెలుగు వాచకంలో బతుకమ్మ పేరుద్దాం, బతుకమ్మ ఆడుదాం, బతుకమ్మలెత్తుదాం, కాళ్ళా గజ్జా, తెలంగాణ రాష్ట్రం అన్న పాఠాలు ఉన్నాయి.

మూడవ తరగతిలోనే తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించిన పాఠం తెలుగు వాచకంలో పొందుపరిచారు.

నాల్గవ తరగతి తెలుగు వాచకంలో తెలంగాణ గొప్పతనం ఇతివృత్తంగా “తెలంగాణ వైభవం” అన్న పాఠం ఉన్నది.

ఐదవ తరగతి తెలుగు వాచకంలో హైదరాబాద్ చరిత్రను వివరిస్తూ “ప్యారా హైదరాబాద్” పాఠం, తెలంగాణ సంస్కృతి, పండగలు గురించి “బోనాలు” పాఠం, తెలంగాణ చరిత్ర, స్ఫూర్తిదాతల జీవితాలను విద్యార్థులకు వివరించే “చిట్యాల ఐలమ్మ” పాఠ్యాంశం చేర్చారు.

ఆరవ తరగతి తెలుగు పుస్తకంలో రంజాన్ పండగ గురించి, మూసీ నది గురించి, గండిపేట చెరువు గురించి గోల్కొండ కోట గురించి పాఠాలు ఉన్నాయి.

ఏడవ తరగతి తెలుగు వాచకంలో మన తెలంగాణ పండగల మీద, కాకతీయ పౌరుష ప్రతీక అయిన రుద్రమదేవి మీద, ఆరుట్ల కమలాదేవి గారి మీద పాఠ్యాంశాలు ఉంటాయి.

ఎనిమిదో తరగతి తెలుగు మరియు స్పెషల్ తెలుగు సబ్జెక్టుల్లో తెలంగాణ చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక స్పృహను ప్రతిబింబించే విధంగా…పాల్కురికి సోమనాథుడు, దాశరథి కృష్ణమాచార్య, వట్టికోట ఆళ్వారు స్వామి మొదలైన వారి రచనలు…. ఉప వాచకంలో షోయబుల్లాఖాన్, చిందు ఎల్లమ్మ, పీ. వీ. నరసింహారావు గార్ల గురించి పాఠాలు మనం చూడవచ్చు.

తొమ్మిదో తరగతి తెలుగు (స్పెషల్ తెలుగు) వాచకాల్లో కాళోజీ నారాయణరావు, డాక్టర్ సి.నారాయణరెడ్డి, సుద్దాల హనుమంతు లాంటి తెలంగాణ సాహిత్యవేత్తల రచనలు పాఠ్యాంశాలుగా.. తెలుగు ఉపవాచకంలో పాఠ్యాంశాలుగా కొమురం భీం, కాళోజి, సురవరం ప్రతాపరెడ్డి, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ లాంటి మహనీయుల జీవితాలు మన విద్యార్ధులు నేర్చుకుంటారు.

పదవ తరగతి తెలుగు వాచకాల్లో డాక్టర్ వానమామలై వరదాచార్యులు, డాక్టర్ సామల సదాశివ, దాశరధి కృష్ణమాచార్య, సినారె, అలిశెట్టి ప్రభాకర్ మొదలైన తెలంగాణ కవులు, రచయితల సాహిత్యాన్ని పాఠ్యాంశాలుగా పరిచయం చేయడంతో పాటు…ఉపవాచకంలో స్ఫూర్తిప్రదాతలు అన్న శీర్షికతో తెలంగాణ మహనీయులు శ్రీ పీ.వీ. నరసింహారావు, మగ్దూం మొహియుద్దీన్, అరిగె రామస్వామి, డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ గార్ల జీవితాలు విద్యార్థులకు పరిచయం చేస్తారు.

ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఆరవ చాప్టర్లో “సంస్కృతి సమాచారం” శీర్షిక కింద తెలంగాణ సాహిత్యం, శిల్పాలు, కట్టడాల గురించి పాఠాలు. ఇందులో భాగంగానే “తెలంగాణలో పచ్చదనం” అన్న పేరుతో ప్రత్యేకంగా ఒక పాఠ్యాంశం ఉంది.

ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో 5వ విభాగం అయిన మతము సమాజము చాప్టర్ లో తెలంగాణలో గొప్పగా జరుపుకునే బోనాల గురించి, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జహంగీర్ పీర్ దర్గా గురించి, తెలంగాణ సమ్మక్క సారక్క (మేడారం) జాతర గురించి, పోతరాజు గురించి, బీరప్ప గురించి, కాటమరాజు గురించి, గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, గంగమ్మ, పోచమ్మల గురించి మొత్తంగా మన తెలంగాణకు సొంతమైన సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులు నేర్చుకుంటారు.

ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో “ఆధునిక కాలంలో కళలు- కళాకారులు” అన్న పాఠ్యాంశంలో.. కిన్నెర వాయిద్యం మొగులయ్య గురించి, అదిలాబాద్ రాజ గోండులు జరుపుకునే దీపావళి గురించి, లంబాడీల గురించి, డప్పు నాట్యం గురించి ఇంకా ఎన్నో తెలంగాణ సమాజ ప్రత్యేకతల గురించి పాఠాలు… అలాగే “సినిమా ముద్రణ మాధ్యమాలు” అన్న శీర్షిక కింద భూస్వామ్య వ్యవస్థ పై నర్సింగ్ రావు గారు తీసిన “మాభూమి” సినిమా గురించి, గిరిజన పోరాటాలకు సంబంధించిన అల్లాణి శ్రీధర్ గారి “కొమరం భీం” చలన చిత్రం గురించి… పత్రికా రంగంలో సురవరం ప్రతాప రెడ్డి గారి గోల్కొండ పత్రిక మొదలైన వాటి గురించి సమాచారం పొందుపరచడం జరిగింది.

పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో 21 వ పాఠంగా 308 నుండి 324 పేజీ వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి విపులంగా చర్చించడం జరిగింది. భారత దేశంలో హైదరాబాద్ రాష్ట్రం కలయిక, 1969 ఉద్యమం 1990 లలో ఉద్యమాలు, ధూమ్ ధామ్ గర్జన పాదయాత్రలు బోనాలు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సాగరహారం, వంటా-వార్పు ఇలాంటి వినూత్న పోరాటాల గురించిన సమాచారం ఈ చాప్టర్ లో పొందుపరిచారు.

ఇట్లా రాసుకుంటు పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే.

భవిష్యత్ తెలంగాణ పౌరులకు మనం చేసిన పోరాటం, మన మహత్తర సంస్కృతి, చరిత్ర, వైతాళికులను పరిచయం చేసే ఒక ప్రక్రియ అయిదేళ్ల క్రితమే మొదలైంది.

ఇది ప్రారంభం మాత్రమే. జిజ్ఞాస ఉన్న పిల్లల మెదళ్లలో ఒక విత్తనం అయితే ఈ పుస్తకాలు నాటగలవనే నమ్మకం నాకుంది.

By: దిలీప్ కొణతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *