మద్రాసు నుండి సినీపరిశ్రమ హైదరాబాదుకు తరలివచ్చినా ఇక్కడివారికి సినిమారంగంలో తగిన ప్రాధాన్యత దక్కగపోగా ఆంధ్రాప్రాంతానికి చెందినవారి ఆధిపత్యం ఎక్కువైందని దర్శకుడు రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఫీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తెలంగాణోడు’ సినిమా లోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది.
రఫీ మాట్లాడుతూ తెలంగాణ సాధనకోసం పోరాడిన ఓ యోధుడి కథ సారాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నానని, ఈ సినిమా ద్వారా తెలంగాణకు చెందిన కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించబోతున్నానని వివరించారు. ‘ప్రతివిషయంలో ఇక్కడి కళాకారులను అణగదొక్కే ప్రయత్నం జరిగిందని,కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మన పరిశ్రమను మనమే అభివృద్ధి చేసుకుందామ’ని చెప్పారు. ‘అమరుల త్యాగాల ఫలితంగా, సోనియాగాంధీ పట్టుదలవల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని’ రఫీ అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఆవిర్భవించిన 24 శాఖలకు సంబంధించిన వారంతా కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి, ప్రేమ్ రాజ్, వడ్డేపల్లి కృష్ణ, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.