కోర్టు కేసులలో నలుగుతున్న ప్రభుత్వ భూముల విలువ రూ.5 లక్షల కోట్ల పైమాటే. కేసులలో ప్రభుత్వం విజయంసాధిస్తే బంగారు తెలంగాణ కాదు.. వజ్రాల తెలంగాణ సాధించగలుగుతాం.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇటీవల అన్న మాటలివి. వివాదాల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూములు సర్కారుకు దక్కేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అన్నమాటలు మెదక్ జిల్లాకు సరిగ్గా సరిపోతాయి.
-మెదక్ జిల్లాలో 2వేల ఎకరాల సర్కారీ భూములపై కన్ను
-మార్కెట్ విలువ వేల కోట్లలోనే తప్పుడు పత్రాలతో కోర్టులకు..
-అధికారుల కృషితో వందల ఎకరాలకు విముక్తి
హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉన్న జిల్లాలో వేల కోట్ల విలువచేసే దాదాపు 1800 ఎకరాల ప్రభుత్వ భూములు కోర్టు కేసులలో చిక్కుకున్నాయి. ఇవికాక మరికొన్ని చిన్నచిన్న ప్రభుత్వ భూములపైనా న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. అక్రమపత్రాలు సృష్టిస్తున్న కొందరు వాటిని దక్కించుకోవడానికి వక్రమార్గాలు వెతుకుతున్నారు.
తెలంగాణ పది జిల్లాల్లో ప్రభుత్వ భూముల లెక్క తేల్చాలని ఇటీవలే సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వాటికి ముందే మెదక్‌జిల్లాలో అధికార యంత్రాంగం ఆ పని పూర్తిచేసింది. జిల్లాలో మొత్తం లక్షా 96వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. వీటిలో దాదాపు 3,200 ఎకరాలు అత్యంత ఖరీదైనవిగా గుర్తించారు. వీటి విలువ వేలకోట్లలో ఉంటుందని అంచనా. ఇందులో దాదాపు 2వేల ఎకరాల చుట్టూ ఫెన్సింగ్, ప్రహరీ గోడలు నిర్మించి, ఆక్రమణలకు చెక్ పెట్టారు. ఈ విషయంలో జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ మన్ననలు కూడా పొందారు.
గతంలో ప్రభుత్వ భూముల వివరాలు కాగితాలకే పరిమితమైతే.. ఈసారి రంగులతో కూడిన నక్షలు తయారు చేయించి, భూమి రికార్డులను కంప్యూటరీకరించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు పెట్టారు. భూములవద్ద ఇది ప్రభుత్వ భూమి అని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ భూముల క్రయవిక్రయాలకు చెక్ పడింది. దీంతో తమకు అడ్డుపడుతున్న అధికారులపై అక్రమార్కులు బురదజల్లటం పనిగా పెట్టుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ భూములపై పూర్తి అవగాహన కలిగి, కబ్జాదారులకు భూమి దక్కకుండా కోర్టుల్లో కృషి చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారి జిల్లానుంచి బదిలీ అవుతున్నారని ప్రచారం చేస్తూ కింది స్థాయి అధికారులను బెదిరిస్తున్నారు.
అయితే ప్రభుత్వ భూములను కాపాడడంలో సదరు అధికారి తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మెచ్చుకోవడం గమనార్హం. జిల్లాలో కోర్టు కేసుల్లో నలుగుతున్న విలువైన భూముల వివరాలను నమస్తే తెలంగాణ సేకరించింది. విలువైన సర్కారు భూములను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారంతా గత ప్రభుత్వంలో ఓ వెలుగువెలిగిన రాజకీయ నాయకులే ఆ వివరాలతో వెల్లడవుతున్నది. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్న పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్, రామచంద్రాపురం, సంగారెడ్డి సమీపంలోని కంది, నర్సాపూర్ వంటి ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములపై సదరు రాజకీయ పెద్దలు కన్నేశారు. అక్రమ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములు తమవేనంటూ కోర్టులకెక్కారు.
కంది సమీపంలో కబ్జా కథ
సంగారెడ్డి మండలం కంది సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారి పక్కన రూ.500 కోట్ల విలువచేసే 150 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో చిక్కుకున్నది. సర్వే నంబరు 149లోని ఈ సీలింగ్ భూమిని పంజాబ్ సింగ్ అనే వ్యక్తి గతంలో ప్రభుత్వానికి అప్పగించాడు. అయితే తిరిగి భూమి నాదేనని ఆయనతోపాటు ఆయన వద్ద భూమి కొనుగోలుచేసిన వారు కోర్టును ఆశ్రయించారు. ఆ భూమి రికార్డులను బ్యాంకులో తనఖాపెట్టి రుణం కూడా తీసుకున్నారు.
సంగారెడ్డికి చెందిన గత ప్రభుత్వంలోని ఓ నాయకుడి అండతో ఆ భూమిని కాజేయాలని సదరు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లా కోర్టు, హైకోర్టు, రంగారెడ్డి జిల్లా ట్రిబ్యునల్ కోర్టులు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ తీర్పునిచ్చాయి. దీంతో ఖంగుతిన్న అక్రమార్కులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ భూమిగా స్పష్టమైన ఆధారాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ శరత్ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. భూమిని కాపాడుకోవడానికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశించింది కూడా. ఈ భూమి విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు భూమికి సంబంధించిన ఆధారాలతో అధికారులు కోర్టులకు నివేదికలు సమర్పిస్తున్నారు. దీంతో తమకు భూమి దక్కకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్న రెవెన్యూ అధికారులపై అక్రమార్కులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. తమకు అడ్డుపడుతున్న ఐఏఎస్ అధికారి బదిలీ అవుతున్నారంటూ తప్పుడు ప్రచారానికి కూడా దిగుతున్నారు. జిల్లాలో గతంలో పనిచేసిన కిందిస్థాయి రెవెన్యూ అధికారుల ద్వారా తప్పుడుపత్రాలు సృష్టించి, ఇప్పుడున్న అధికారులపై బురదజల్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ముత్తంగిలో ఐదెకరాలు మింగేయత్నం!
పటాన్‌చెరు మండలం ముత్తంగిలో 521 సర్వే నంబరులోని 5 ఎకరాల భూమిని 1970లో శ్రీనివాసరావు అనే వ్యక్తి భూదాన్ బోర్డుకు అప్పగించారు. భూదాన్ బోర్డువారు ఆ భూమిని పేదలకు ఇచ్చినట్లు పేర్కొనడంతో రంగంలోకి దిగి సర్వే చేసిన రెవెన్యూ అధికారులు 2012లో ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రూ.30 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని స్వాధీనం చేసుకుని కంచె కూడా ఏర్పాటు చేశారు. అయితే 1970 నుంచి లేని ప్రతిపాదనలను గత ఏడాదికాలంలో సృష్టించిన అక్రమార్కులు.. ఈ భూమి తమదేనని, అందుకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.
జాయింట్ కలెక్టర్ మాత్రం ఈ భూమి ప్రభుత్వానిదేనని, ఇతరులకు చెందే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. దీంతో సరైన ఆధారాలు లేక, అటు కోర్టుకు వెళ్లలేక, భూమి ప్రభుత్వానిదేనని నివేదికలు ఇచ్చిన అధికారిని ఏమి చేయలేక అక్రమార్కులు పలు రకాలుగా కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతోనే సదరు అధికారి బదిలీ అవుతున్నారని, ఇక ఆ భూములు తమకే దక్కుతాయని కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిని అక్రమార్కులు భయపెడుతున్నట్లు సమాచారం.
సమర యోధులను బెదిరిస్తున్నారు!
పటాన్‌చెరు మండలం కొల్లూరులోని సర్వే నంబరు 191లో 40 ఎకరాలను గత ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చింది. అయితే వారినుంచి ఈ భూముల క్రయవిక్రయాలు జరిగాయి. ఇందులో గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భూమి విలువ రూ.30 కోట్లకు పైనే ఉంటుంది. స్వాతంత్య్ర సమరయోధులను బెదిరించి ఈ భూమిని కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ భూమిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. భూమి విక్రయాలు నిబంధనల మేరకు జరిగాయా? అక్రమంగా జరిగాయా? అనే అంశంపై విచారణ చేపట్టారు. ఈ భూమి ఎంతో విలువైనది కావడంతో ఎలాగైనా దానిని దక్కించుకోవాలని అక్రమార్కులు వక్రమార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు.
వివిధ రకాల పత్రాలు సృష్టిస్తూ కేసును ఎప్పటికప్పుడు పెండింగ్‌లో పెట్టేవిధంగా కుట్రలు చేస్తున్నట్లు సమాచారం. వాటిని ఆధారం చేసుకుని న్యాయవివాదాలు లేవనెత్తేందుకు కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా వారు ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా.. అక్రమాలకు అవకాశం ఇవ్వని అధికారులను మానసికంగా కుంగదీసేందుకు వారిపై కిందిస్థాయి రాజకీయ నాయకుల ద్వారా ఆరోపణలు చేయిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐలాపూర్‌లో అక్రమార్కులు!
పటాన్‌చెరు మండలం ఐలాపూర్‌లో 1263 ఎకరాల ప్రభుత్వ భూమిపై కూడా గత ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. ఆ భూమిని కాజేయడానికి కోర్టును ఆశ్రయించారు. భూమిని కాపాడుకోవడానికి రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. భూమిని దక్కించుకోవడానికి అక్రమార్కులు కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని రెవెన్యూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ రికార్డులను కోర్టుకు సమర్పించారు. స్వయానా జేసీ అడ్వకేట్ జనరల్ వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరించారు. కాగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకువచ్చి భూమిని ఆక్రమించుకోవడానికి అక్రమార్కులు కుట్రలు పన్నుతున్నారు. ఈ భూమి విషయంలో డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
స్కూలు భూమినీ వదలటం లేదు!
పటాన్‌చెరు పట్టణం నడిబొడ్డున గల ప్రభుత్వ హైస్కూల్‌కు సంబంధించిన రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి కూడా అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారు. రూ.20 కోట్లకు పైగా విలువచేసే ఈ భూమిని ఓ పట్టేదారు గతంలో ప్రభుత్వానికి అందించారు. అయితే ఇప్పుడు ఆ భూమి తమదేనని, తానే పట్టేదారునని కొందరు పత్రాలు సృష్టించి కోర్టును ఆశ్రయించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఓ నాయకుడి అండదండలతో ఈ వ్యవహారం సాగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. హైస్కూల్ భూమి ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించిన జాయింట్ కలెక్టర్.. కోర్టునుంచి స్టే తెచ్చి, స్కూలు చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. భూమిని కాపాడుకోవడంకోసం స్కూల్ ఉపాధ్యాయులు కూడా నడుం బిగించడం విశేషం. ఈ భూమిని కాపాడడానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటుండడంతో అక్రమార్కులు అధికారులపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
దేవుడి భూములకూ టోకరా!
వర్గల్ మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్కనేగల 30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కొందరు రాజకీయ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా అక్రమార్కుల ఆటలు కట్టించి, ఆ భూమి చుట్టూ కంచె నిర్మించారు. దీంతో తమ ఆట సాగని కబ్జాదారులు ఇతర మార్గాలు వెతుకుతున్నారు. అలాగే జహీరాబాద్ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర ట్రాక్టర్ల తయారీ కంపెనీ పక్కన కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు ఇటీవలే స్వాధీనం చేసుకున్నారు.
నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.కోట్ల విలువ చేసే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని వారం క్రితం జాయింట్ కలెక్టర్ శరత్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి రెవెన్యూ ఆధారాలతో భూమిని స్వాధీనం చేసుకోవడంతో అప్పటికే ఆ భూమిపై కన్నేసి కబ్జాలో ఉన్నవారు ఖంగుతిన్నారు.
అయినా దానిని వదలుకోలేక అక్రమ పత్రాలు సృష్టించే పనిలో పడ్డట్లు తెలుస్తున్నది. మెదక్ పట్టణంలో 70 ఎకరాలను కూడా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కంచె వేశారు. వీటితోపాటు పారిశ్రామిక ప్రాంతమైన జిన్నారంలో 20 ఎకరాలు, రామచంద్రాపురంలో 50 ఎకరాలు, హత్నూరలో 70 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Source: [నమస్తే తెలంగాణ]