mt_logo

తెలంగాణలో 1500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న జర్మన్ కంపెనీ

జ‌ర్మ‌నీకి చెందిన లైట్ఆటో జీఎంబిహెచ్ అనే కంపెనీ తెలంగాణ‌లో 1500 కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. జ‌ర్మ‌నీ అంబాసిడ‌ర్ వాల్ట‌ర్ జే లిండ‌ర్, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స‌మక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. ఈ పెట్టుబడుల వల్ల దాదాపు 9 వేల మందికి ప్ర‌త్య‌క్షంగా, 18 వేల మందికి ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నుంది. ఈ కంపెనీ కార్లు, కామ‌ర్షియ‌ల్ వాహ‌నాలు, ద్విచ‌క్ర వాహ‌నాల‌కు సంబంధించిన మెగ్నిషీయం భాగాల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. సోమవారం హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జ‌రిగిన‌ జ‌ర్మ‌నీ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జ‌ర్మ‌నీ పెట్టుబ‌డుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆహ్వానం ప‌లుకుతుంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తామ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు జ‌ర్మ‌నీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయ‌ని పేర్కొన్నారు. చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లే జ‌ర్మ‌నీ జీడీపీ వృద్ధికి స‌హ‌క‌రిస్తున్నాయని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో డిఫెన్స్ ల్యాబ్‌లు, ఏరోస్పేస్ ప‌రిశ్ర‌మ‌లు, ప‌రిశోధ‌నా కేంద్రాలు ఉన్నాయన్నారు. జ‌ర్మ‌నీ పెట్టుబ‌డిదారుడు ఎవ‌రైనా రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ పెట్టాల‌ని భావిస్తే దేశంలోని మిగ‌తా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహాకాల‌ను అందించేందుకు కృషి చేస్తామ‌ని కేటీఆర్ చెప్పారు. ఏడున్న‌రేండ్ల‌లో సీఎం కేసీఆర్ పాల‌న‌లో ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాం. ప‌రిశ్ర‌మ‌ల‌కు సింగిల్ విండో విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నామ‌ని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చ‌ట్టం లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు క్లియ‌రెన్స్ ఇచ్చామ‌ని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *