mt_logo

తెలంగాణ బిల్లుపై చర్చకు లైన్ క్లియర్

చిరకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ కల కొద్దిగంటల్లో సాకారం కాబోతుంది. మంగళవారం జరిగే పార్లమెంటు సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలనుండి 4 గంటలదాకా లోక్‌సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారని కమల్ నాథ్ చెప్పారు. పార్లమెంటుపై పెప్పర్ స్ప్రే చల్లి సభను అడ్డుకున్న సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు తొలగించే అవకాశాలు లేవని తెలుస్తుంది. సస్పెన్షన్ మూలంగా సమైక్యవాదుల నుండి ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావులేకపోవడంతో మంగళవారం బిలుపై చర్చ నల్లేరు మీద నడకే అని అందరూ భావిస్తున్నారు. బిల్లును గట్టెక్కించేందుకు యూపీఏ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ జాగ్రత్తగా ముందుకు వెళుతుంది. బిల్లుకు ఆమోదం తెలిపిన బీజేపీతో కేంద్రమంత్రులు కీలక సంప్రదింపులు జరుపుతూ వారి డిమాండ్లపై చర్చలు కొనసాగించారు. సోనియాగాంధీ పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎదురైన బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడును బిల్లుకు మద్దతు తెలపమని కోరారు. కేంద్రమంత్రి జైరాం రమేష్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో మరోసారి సమావేశమై కీలక విషయాలు చర్చించారు. యువనేత రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగి సీమాంధ్ర నేతలతో వార్ రూమ్ లో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించారు. అసెంబ్లీతో కూడిన తాత్కాలిక యూటీ అర్థరహితమైనదని, సీమాంధ్రకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు. వీరినుండి కూడా వ్యతిరేకత రానుండక పోవడంతో తెలంగాణ బిల్లుపై చర్చకు మార్గం సుగమం కానుంది. సభలో చర్చ ప్రారంభించనున్న సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తర్వాతే కాంగ్రెస్ తెలంగాణ పట్ల కీలక నిర్ణయం తీసుకున్న విషయం సభకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆమోదం తెలిపిన టీడీపీ, వైసీపీ యూటర్న్ తీసుకోవడంపై సోనియా ఇరు పార్టీలపై దుమ్మెత్తిపోయనున్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు, సభలో చర్చకు రెండు గంటల సమయం కేటాయించాలని రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్నీ సవ్యంగా సాగితే రాష్ట్రపతి సంతకంతో గెజిట్ ప్రచురణ జరిగి ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *