mt_logo

తెలంగాణ తెచ్చిందెవరో తేల్చుకుందాం- కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్ కు చెందిన బూర్గుల రామకృష్ణారావు తెలంగాణను ఆంధ్రలో కలిపితే మహబూబ్ నగర్ ఎంపీ అయిన కేసీఆర్ తెలంగాణ ను సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం మావల్లే అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని, గ్రామగ్రామానా కేసీఆర్ లు ఉన్నారని, వాళ్ళ ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ ఎవరివల్ల వచ్చిందో తేల్చుకుందాం అని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘ఇద్దరు ఎంపీలే ఉన్న టీఆర్ఎస్ వల్ల తెలంగాణ వచ్చిందా? అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రం ఇవ్వకుంటే ఆ ఇద్దరు ఎంపీలు కూడా గెలవరనే తెలంగాణ ఇచ్చారు’. అని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణలోని నాలుగు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన టీడీపీ నేతలు నర్సింహారెడ్డి, మధుసూదన్ రెడ్డి, యాదిరెడ్డి, సంజీవరెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రతాప్ తదితరులను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెట్టే పార్టీ తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టికొట్టేదేనని, అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తెలంగాణకు అడ్డం తిరిగిందని, ఇప్పుడు తమ్ముడు వస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు, పార్టీలు పెట్టినప్పుడు ఎవరు ఏం మాట్లాడారో అందరికీ తెలుసని, తెలంగాణ ఇచ్చే సమయానికి ఎవరెవరు మారిపోయారు కళ్ళముందే కనిపిస్తుందని జగన్, చంద్రబాబు, కిరణ్ లను ఉద్దేశిస్తూ విమర్శించారు. ఆంధ్రాపార్టీలు తెలంగాణకు ఇంకా అవసరమా? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *