ప్రభుత్వ పథకాలు అర్హులకే చెందేలా కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మాదాపూర్ హైటెక్స్ లో ఈరోజు జరిగిన కుటుంబాల సూక్ష్మస్థాయి సర్వే సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు మంత్రులు, కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కొత్త పంధాని, మార్గాన్ని నిర్దేశించుకుంటుందని, ఆశించిన స్థాయిలో పేదరిక నిర్మూలన జరగటం లేదని, అంతా కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పారు. మండలస్థాయి ఎంఆర్వో, ఎండీఓ దగ్గరనుంచి జిల్లా స్థాయి కలెక్టర్ వరకు ఎలాంటి తప్పుడు లెక్కలు, ధృవీకరణ పత్రాలు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.
ఇప్పటివరకు జరిగిన సర్వేలు సరిగాలేవని, ఒక్కో సర్వే ఒక్కో రకంగా ఉంటుందని, సరైన లెక్కలు లేకపోవడంతో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని, సర్వేలు మొక్కుబడిగా చేస్తే ప్రయోజనం ఉండదని కేసీఆర్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వందశాతం అమలుచేసి తీరుతామని, రైతులకు రుణమాఫీ, రెండు బెడ్ రూంల ఇళ్ళు తప్పకుండా అందేలా చేస్తామని, ఎట్టిపరిస్థితుల్లో అనర్హులకు దక్కనీయమని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అంతులేని అవినీతి లెక్కలు తేలాలంటే సమగ్ర సర్వే జరగాల్సిందేనని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉన్న 86లక్షల కుటుంబాల గణన ఒకే రోజు నిర్వహిస్తామని, రాష్ట్రంలో 86లక్షల కుటుంబాలు ఉంటే రేషన్ కార్డులు మాత్రం కోటీ 7లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. సర్వేకోసం అధికారులు ఆయా గ్రామాలకు వెళ్ళేప్పుడు ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు వంటి వాహనాలను ఉపయోగిస్తామని చెప్పారు. ప్రతిదానికీ వైట్ రేషన్ కార్డునే లింకుగా పెట్టారని, 55లక్షల ఇళ్ళు కట్టించినట్లుగా లెక్కలు చెప్తున్నాయని, గృహనిర్మాణంలో వేలకోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. అర్హులకు ఇళ్ళు కట్టించి ఇస్తామని, పెన్షన్లు ఇస్తామని, ప్రాణం పోయినా అనర్హులకు రేషన్ కార్డు ఇవ్వమని సీఎం తేల్చిచెప్పారు.