-1,05,76,922 కుటుంబాల్లో సర్వే పూర్తి
-ఇంకా మిగిలిన 2.3 లక్షల కుటుంబాలు
-సర్వే సమగ్రం.. నూటికి 106 శాతం నమోదు
-రెండుమూడు రోజుల్లో కంప్యూటరీకరణ
-9 జిల్లాల్లో 381 కేంద్రాల్లో డాటా ఎంట్రీ
-నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌కు బాధ్యత
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ప్రజలు అక్కున చేర్చుకున్నారు. నూటికి నూట ఆరు శాతం కుటుంబాలు సర్వేలో భాగస్వాములయ్యాయి. ఆరు జిల్లాల్లో సంపూర్ణంగా సర్వే జరిగింది. ఇతర జిల్లాల్లోనూ 96 శాతానికి మించి స్పందన లభించింది. కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయం ప్రస్తుత సర్వేతో తేటతెల్లమైంది. 2011లో జరిగిన జనగణన సందర్భంగా నమోదైన కుటుంబాల సంఖ్యతో పోల్చితే తాజా సర్వేలో వాటి సంఖ్య పెరిగింది.
ఎన్యూమరేటర్లు సేకరించిన సమాచారాన్ని మరో రెండు మూడు రోజుల్లో కంప్యూటరీకరించనున్నారు. ప్రతి ఇంటి సర్వే ఫార్మాట్‌ను స్కాన్ చేసి అందులోని వివరాలను మార్చేందుకు ఆస్కారం లేకుండా పాలనా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు వీలుగా హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ మినహా మిగతా తొమ్మిది జిల్లాల పరిధిలో 381 కేంద్రాలలో 17,140 కంప్యూటర్ డేటా ఎంట్రీలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వే వివరాల కంప్యూటరీకరణకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. కంప్యూటరీకరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్‌ఐసీ)కు ప్రభుత్వం అప్పగించింది. అయితే హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని సర్వే వివరాల కంప్యూటరీకరణను జీహెచ్‌ఎంసీ యంత్రాంగం ద్వారా చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కోటీ ఐదు లక్షల కుటుంబాలు
తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించేందుకు 3,69,729 మంది ఎన్యూమరేట్లను ఎంపిక చేసింది. వారితో 99.41 లక్షల కుటుంబాలను సర్వే కోసం రెండు రోజుల ముందు గుర్తించింది. అయితే సర్వే నిర్వహించిన మంగళవారం (19వతేదీ) ఒక కోటి 5లక్షల 76వేల 922 కుటుంబాల వివరాలను నమోదు చేశారు. నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో వంద శాతానికి మించి ఎన్‌రోల్‌మెంట్ జరిగింది.
ఖమ్మం జిల్లాలో 96 శాతం, హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఏరియాలో 97 శాతం మేరకు సర్వే నమోదు జరిగింది. ఇంకా జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు లక్షల కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పది వేల మంది చొప్పున, రంగారెడ్డి జిల్లాలో 10,655 కుటుంబాల వివరాల నమోదు కూడా మిగిలిపోయినట్లుగా అధికారులు నిర్థారించారు. సర్వే అంశాలపై బుధవారం సాయంత్రం సచివాలయంనుంచి ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, సెర్ప్ డైరెక్టర్ మురళి తదితరులు జిల్లా కలెక్టర్లతో రెండు గంటల పాటు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మంగళవారం నాటి సర్వేలో తలెత్తిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలను కలెక్టర్లు వివరించారు. ఇంకా మిగిలిపోయిన వారి నమోదుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. దాంతో ముఖ్యమంత్రి చరిత్రాత్మకంగా ఒకే ఒకరోజున సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు మాత్రమే అనుమతించారని, మిగిలిపోయిన వారి విషయంలో ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటన నుంచి ఈనెల 24న తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు కలెక్టర్లకు తెలిపారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..