mt_logo

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆఖరిరోజు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్రప్రభుత్వానికి
పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్‌ల వంటి
వారు అరచెయ్యిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.

గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలు తెలంగాణ ప్రజలలో కొత్త అనుమానాలను రేకెత్తించాయి. బిల్లు తిరస్కరణ తీర్మానం మూజువాణీ వోటుతో గెలిచిందనే తప్పుడు నిర్ధారణ ప్రచారంలోకి వచ్చి అసలు అది జరగవచ్చునా, జరిగినదేమిటి, దాని పర్యవసానాలేమిటనే ప్రశ్నలు తలెత్తాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013పై చర్చ ముగియకుండానే, ఆ బిల్లుపై అభిప్రాయ సేకరణ జరిగిందని, రాష్ట్రపతి కోరినట్టుగా ఆ అభిప్రాయాలను పంపుతామని స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వ తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమోదించిందని ప్రకటించారు. ఆ రెండు వాక్యాల తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నానని ప్రకటించారు.అప్పటికే రెండుసార్లు వాయిదాపడిన సభలో హఠాత్తుగా ఈ మూడు ప్రకటనలూ చేసి సభను అర్ధాంతరంగా, నిరంకుశంగా ముగించారు. ఇటువంటి ముగింపు ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్ రాజ్యాంగ వ్యతిరేకంగా, శాసనసభా సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించారు. ఈ ముగింపు వల్ల, ముఖ్యంగా బిల్లును తిరస్కరిస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రభుత్వ తీర్మానంగా అభివర్ణించి దాన్ని సభ మూజువాణీ వోటుతో ఆమోదించిందని అనడం వల్ల తెలంగాణ సమాజంలో మళ్లీ భయసందేహాలు వ్యాపిస్తున్నాయి. నిజంగానే సభకు ఆ అధికారం ఉందా? ఇక్కడ బిల్లు తిరస్కరణ జరిగితే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియకు ఏమవుతుంది? తెలంగాణ వస్తుందా? రాదా? ఆ అనుమానాలు నివృత్తి చేయాలి.

మొదటి విషయం: రాష్ర్టాల ఏర్పాటు అధికారాన్ని రాజ్యాంగం పూర్తిగా పార్లమెంటుకు మాత్రమే ఇచ్చింది. సంబంధిత రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు మీద అభిప్రాయం చెప్పే అవకాశమే ఉంది. ఆ బిల్లును ఆమోదించడానికి గాని, తిరస్కరించడానికి గాని అధికారం లేదు. అందువల్ల బిల్లును తిరస్కరిస్తున్నామని శాసనసభ మూజువాణీ వోటుతో తీర్మానం చేసినా ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి, కేంద్రప్రభుత్వం, పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవలసిన అవసరమే లేదు.

ఈ తీర్మానానికి సంబంధించి కొన్ని వివాదాస్పద సాంకేతిక అంశాలు కూడా ఉన్నాయి. స్పీకర్ దాన్ని ప్రభుత్వ తీర్మానమని ప్రకటించారు. అది తప్పు,అబద్ధం. ప్రభుత్వ తీర్మానం అన్నప్పుడు అది ప్రభుత్వాధికారంలో ఉన్న ఒకానొక వ్యక్తి తీర్మానం కాదు, మంత్రివర్గపు తీర్మానం కావలసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అనేదేదీ లేదు. ఉన్నా రెండు ప్రత్యర్థి శిబిరాలుగా ఉంది. అందువల్ల దాన్ని కిరణ్ కుమార్‌రెడ్డి అనే వ్యక్తి ప్రవేశపెట్టిన తీర్మానం అనో, ఆయన నాయకుడుగా ఉన్న మంత్రివర్గంలో కొద్దిమంది ప్రవేశపెట్టిన తీర్మానం అనో అనడం సరైనది. అంటే ఆయన తన మంత్రివర్గ విశ్వాసాన్ని, సభా విశ్వాసాన్ని కోల్పోయానని ముందుగా అంగీకరించవలసి ఉంటుంది. అప్పుడు ఆ తీర్మానానికి విలువే ఉండదు. శాసనసభా సంప్రదాయాల ప్రకారం అటువంటి తీర్మానం ఏపద్ధతిలో తయారు కావాలో, దాన్ని ఎన్ని రోజుల ముందు సమర్పించాలో నిర్ధిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ ఉల్లంఘనకు గురయ్యాయి. కనుక ఆ తీర్మానమూ, దాన్ని అనుమతించడమూ, దాన్ని ఆమోదించడమూ అన్నీ కుట్రలో భాగమే. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక అబద్ధంతో, కుట్రతో, ఉల్లంఘనతో, శాసనసభను, సమాజాన్ని తప్పుదారి పట్టించడంతో ముగిసింది.

ఈ తిరస్కరణ తీర్మానానికి ఏమైనా ప్రభావం, ఫలితం ఉంటాయా? రాజ్యాంగ అధికరణం 3 ప్రకారం ఉనికిలో ఉన్న రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్రం ఏర్పాటు, ఒక రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం, తగ్గించడం, సరిహద్దులను మార్చడం పూర్తిగా పార్లమెంటు పరిధిలోని అంశాలు. అందులో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు. అందువల్ల శాసనసభ ఈ తీర్మానాన్ని ఒకవేళ పద్ధతి ప్రకారం చేసి ఉన్నా పార్లమెంటులో పెట్టబోయే తీర్మానానికి ఆటంకం కాదు. ఇక పద్ధతి తప్పి అక్రమంగా తయారైన ఈ తీర్మానం దాని సహజ గమ్యమైన చెత్తబుట్టను చేరుతుంది. రాజ్యాంగ అధికరణం 3 సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తెలుసుకోవాలని చెపుతుంది గాని ఆ శాసనసభ సమ్మతినో, అసమ్మతినో బట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పదు. 1953 నుంచి ఇప్పటికి మొత్తం పదకొండు సందర్భాలలో కొత్త రాష్ర్టాల ఏర్పాటు జరిగింది. వాటిలో కూడ పాత రాష్ర్టాలను విభజించి కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేసిన సందర్భాలు ఆరు మాత్రమే.ఆ ఆరు సందర్భాలలో కూడ సంబంధిత శాసనసభలు విభజనకు సమ్మతిస్తూ తీర్మానం చేసిన సందర్భం ఒకే ఒక్కటి.

ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిణామాల నేపథ్యంలో గతంలోని రెండు రాష్ట్ర విభజనల సందర్భంలో సంబంధిత రాష్ట్ర శాసనసభలలో ఏం జరిగిందో, కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు ఎలా స్పందించాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.

మొదటి ఉదాహరణ-1956 నాటి బొంబాయి రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనిది. మొదట బొంబాయి రాష్ర్టాన్ని మహారాష్ట్ర, గుజరాత్ అనే రెండు రాష్ర్టాలుగా, బొంబాయి అనే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని బిల్లు తయారు చేసి బొంబాయి రాష్ట్ర శాసనసభకు పంపించారు. ఆ శాసనసభ చర్చించి, తన మార్పులు, చేర్పులు, సూచనలతో రాష్ట్రపతికి తిప్పి పంపింది. నాటి కేంద్ర ప్రభుత్వం అలా తిరిగి వచ్చిన బిల్లును పక్కన పడేసి, సంయుక్త మహారాష్ట్ర అనే ఒకే రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనతో కొత్త బిల్లును తయారు చేసి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అది అన్యాయమనీ, నిరంకుశమనీ, తమకు ఒక బిల్లు చూపించి, మరొక బిల్లు అమలు చేయడమనీ బాబూలాల్ పరాటే కేంద్ర ప్రభుత్వం మీద వ్యాజ్యం వేశాడు. సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం1959 ఆగస్ట్ 28న ఇచ్చిన తీర్పులో, ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అన్యాయమో, నిరంకుశత్వమో కాదనీ, అధికరణం 3 ప్రకారం రాజ్యాంగబద్ధమనీ ప్రకటించింది. బిల్లులో మార్పులు చేసినప్పుడల్లా సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలు తీసుకోనవసరం లేదని చెప్పింది. అంటే ఇవాళ రాష్ట్ర శాసనసభకు పంపించిన బిల్లుకు సవరణలు చేసినా, పూర్తిగా మార్చినా, అసలు ఈ బిల్లును పక్కన పడేసి కొత్త బిల్లును ప్రవేశ పెట్టినా అది కేంద్రానికి రాజ్యాంగం ఇచ్చిన అధికారమే.

రెండో ఉదాహరణ- పంజాబ్ రాష్ర్టాన్ని విభజించి పంజాబ్ హర్యానా రాష్ర్టాలను ఏర్పాటు చేయడానికి సంబంధించినది. పంజాబీ సుబా, హర్యానా ప్రాంతాలను వేరు చేయాలని సుదీర్ఘ ఆందోళనలు జరిగాక, ఏయే ప్రాంతాలను ఏ రాష్ట్రంలో చేర్చాలనే విషయంలో రెండు చోట్లా హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఆ వాతావరణంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత శాసనసభ అభిప్రాయాలను సక్రమంగా సేకరించడం సాధ్యం కాదని భావించిన కేంద్రం 1966 జూన్ 13న పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించి, శాసనసభను తాత్కాలిక రద్దు స్థితిలో ఉంచింది. బిల్లును శాసనసభకు పంపకుండానే 1966 సెప్టెంబర్ 18న ఆమోదించి, కొత్త రాష్ర్టాలు ఏర్పడ్డాకనే నవంబర్ 1న రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది. అంటే రాష్ట్ర విభజనలో సంబంధిత రాష్ట్ర శాసనసభల అభిప్రాయం అసలు తీసుకోకుండానే రాష్ర్టాలు ఏర్పాటయిన చరిత్ర కూడా ఉందన్నమాట.

ఈ రాజ్యాంగ, చారిత్రక, రాజకీయ పూర్వ రంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడానికి పార్లమెంటుకు, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్‌ల వంటి వారు అరచెయ్యిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.
-ఎన్. వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *