కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కుని జైలు పాలయ్యారని టీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల వైఖరిని ఎండగట్టారు.
జనం మిమ్మల్ని చూసి ఉమ్మేస్తున్నా సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మంత్రులపైనే సీబీఐ విచారణ కొనసాగుతుందని, పొన్నాలను కూడా సీబీఐ విచారిస్తుందని మండిపడ్డారు. దోచుకునే దొంగలు కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఇకముందు కూడా ఆ పార్టీ నేతలే దోషులుగా తేలుతారని రాజేందర్ అన్నారు. కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని, టీఆర్ఎస్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జరిగేదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, 14ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని ఎలాంటి మచ్చ లేకుండా నడిపిన చరిత్ర కేసీఆర్ కుందని, ఆయనపై కేసులు పెట్టేందుకు విచారణల పేరిట మాజీ సీఎంలు చంద్రబాబు, వైఎస్ లు ప్రయత్నించి విఫలమయ్యారని పేర్కొన్నారు.
ప్రజాక్షేత్రంలో పట్టుకోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్, టీఆర్ఎస్ పైన బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందని, పొన్నాల అరిగిపోయిన రికార్డును ప్లే చేస్తూ నవ్వులపాలు అవుతున్నాడని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, పొన్నాల, దామోదర, ఉత్తం కుమార్ లకు ఓటమి తప్పదని, కేసీఆర్ ను విమర్శించే వారంతా నియోజకవర్గాలు కూడా దాటలేని చిన్నస్థాయి నేతలని అన్నారు.