mt_logo

ప్రజాపాలనలో పూర్తిగా పడకేసిన ప్రజారోగ్యం: రేవంత్‌కు కేటీఆర్ లేఖ

ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు హయాంలో  ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడంతో జనం విషజ్వరాలతో మంచం పట్టే దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. గత ఎనిమిది నెలలుగా పారిశ్యుద్ధ నిర్వహణ పూర్తిగా దిగజారిపోయిందని, ఫలితంగా  తీవ్రమైన దోమల బెడద కారణంగా డెంగీ, మలేరియాతోపాటు చికెన్ గున్యా లాంటి జ్వరాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.. రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని చోట్లా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామమన్నారు.

వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని కేటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్‌కు ముందే విష జర్వాలు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్న కనీస అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు. ఫలితంగానే ఇప్పుడు ప్రజలంతా ఇలా విష జ్వరాల బారిన పడే దుస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాదిలో దాదాపుగా 5,700 డెంగీ కేసులు నమోదయ్యాయని, కానీ అనధికారికంగా దీనికి పది రెట్లు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుందని తెలిపారు. డెంగీకి సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల ఒక్క డెంగీతోనే ఇటీవల దాదాపు 50 మంది చనిపోయారని, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరమన్నారు. మొన్నటికి మొన్న ఒక్క రోజులోనే డెంగీతో ఐదుగురు చనిపోయిన సంఘటన ప్రతిఒక్కరిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. గత మూడు నెలలుగా విష జ్వరాల బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కేటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం, సరిపడా  మందులు కూడా లేని కారణంగా జనం ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు పేద, మధ్యతరగతి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అటు ఆరోగ్యం ఇటు డబ్బులు పోగుట్టుకుని జనం అవస్థలు పడుతుంటే.. పట్టించుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీకి రాజకీయ యాత్రలు చేయడం దారుణమని కేటిఆర్ దుయ్యబట్టారు.

మరీ ముఖ్యంగా విజృంభిస్తున్న విషజ్వరాలతో పెద్దసంఖ్యలో చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని కేటిఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అనేక చోట్ల బెడ్లు దొరకక అవస్థలు పడుతున్నారని, పిల్లల ఆరోగ్య సంరక్షణలో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదని అని కేటిఆర్ మండిపడ్డారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ కీలకమైన అంశంలో కూడా ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వీడటం లేదని, ప్రజారోగ్యంపై సీఎం స్థాయిలో నిరంతరం సమీక్షలు జరగని కారణంగానే వైద్యారోగ్య శాఖ ఈ స్థాయిలో  విఫలమైందని స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్యమైన ప్రజా ఆరోగ్యం అంటే ఈ ముఖ్యమంత్రికి పట్టింపు లేదా కేటిఆర్ నిలదీశారు. ప్రజల ఆరోగ్యంకన్నా తమకు తమ పార్టీ స్వప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తోందన్నారు. ఇంకా ఎంతమంది డెంగీ సహా ఇతర విషజ్వరాలతో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వంలో చలనం వస్తుందని కేటీఆర్ నిలదీశారు.

విష జర్వాలు ప్రబల కుండా ఉండాలంటే ముందుగా పారిశుద్ధ్య నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, దోమల బెడద లేకుండా ఇప్పటికైనా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.. గ్రామపంచాయతీలు, పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే ఈ ఏడాది సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అటు పంచాయతీలను, ఇటు పురపాలికలను పట్టించుకున్న నాథుడే లేడని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం దోమల నివారణ మందులు కొట్టేందుకు కూడా పైసలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందన్నారు.  అభివృద్ధి కార్యక్రమాలు కాస్త ఆలసమైనా ఇబ్బంది ఉండదు కానీ.. ఒక్కసారి ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి  తీసుకురాలేమనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా గ్రహించాలని కేటిఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలానికి ముందే ప్రజారోగ్యంపై సమీక్షలు, ముందస్తు ప్రణాళికలు ఉండేవని, ప్రభుత్వ సన్నద్ధత వల్ల జ్వరాలు ప్రబలకుండా అన్నిరకాల చర్యలు తీసుకునే వారిమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ  ముందుచూపు లేకపోవడం వల్లే  రాష్ట్రంలో ప్రజారోగ్యం పతనావస్థకు  చేరుకుందని కేటీఆర్ మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి  ఇకనైనా రాజకీయాలపై దృష్టి పెట్టడం మాని రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగీ, మలేరియా ఇతర విషజ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కేటిఆర్  డిమాండ్ చేశారు. పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తే సగం సమస్య పరిష్కారమవుతుందని కేటిఆర్ సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక కేంద్రాల్లో ఇప్పటికైనా అవసరమైన  మందులను అందుబాటులో ఉంచాలని,  వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడాలని కేటీఆర్ బహిరంగ లేఖలో ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.